Sarkaru Vaari Paata Movie Review And Rating In Telugu | Mahesh Babu | Keerthy Suresh - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Movie Review: ‘సర్కారు వారి పాట’ ఎలా ఉందంటే..

Published Thu, May 12 2022 10:57 AM | Last Updated on Fri, May 13 2022 12:23 PM

Sarkaru Vaari Paata Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : సర్కారు వారి పాట
నటీనటులు : మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌, సముద్రఖని,వెన్నెల కిశోర్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట
దర్శకుడు: పరశురాం
సంగీతం: తమన్‌
సినిమాటోగ్ర‌ఫి: ఆర్ మది 
ఎడిటర్‌: మార్తాండ్ కె వెంకటేష్ 
విడుదల తేది: మే 12, 2022

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌ బాబు.. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తాజాగా ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు​ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని  ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.  

Sarkaru Vaari Paata Movie Review In Telugu

కథేంటంటే..
మహి అలియాస్‌ మహేశ్‌(మహేశ్‌ బాబు) ‘మహి ఫైనాన్స్‌ కార్పోరేషన్‌’ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు . తన దగ్గరు ఫైనాన్స్‌ తీసుకున్నవారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్దం చెప్పి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది కళావతి(కీర్తి సురేశ్‌). ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేశ్‌.. ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు.

Keerthy Suresh In Sarkaru Vaari Paata

కళావతి మాత్రం ఆ డబ్బుతో  ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఒక రోజు మహేశ్‌కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తను అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, `మా నాన్న ఎవ‌రో తెలుసా? నీకు పైసా కూడా ఇవ్వ‌ను` అని మహేశ్‌ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్‌(సముద్రఖని) విఖాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బులు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేశ్‌. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్‌ ఇవ్వాల్సింది 10 వేల డాలర్లు కాదని, రూ. పదివేల కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల రూపాయాల కథేంటి? మహేశ్‌ బాబు గతం ఏంటి? చివరకు రూ.10వేల కోట్లను మహేశ్‌ ఎలా వసూలు చేశాడు అనేదే ‘సర్కారు వారి పాట’ మిగతా కథ. 

Mahesh Babu In Sarkaru Vaari Paata

ఎలా ఉందంటే... 
బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు.. దానికి కమర్షియల్‌ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్‌ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్‌ సినిమాలను లాజిక్‌ లేకుండా చూడాల్సిందే కాబట్టి.. ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు.

ఫస్టాఫ్‌ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిశోర్‌పై మహేశ్‌ వేసే పంచులు.. కళావతితో లవ్‌ ట్రాక్‌ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం 10వేల డాలర్ల కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా.. హీరో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్‌ టర్న్‌ తీసుకుంటుంది. కళావతితో ‘కాలు వేసి నిద్రించే’ కామెడీ సీన్‌ పెట్టి జోష్‌ నింపాడు దర్శకుడు. మహేశ్‌ వేసే పంచ్‌ డైలాగులు, ప్రభాస్‌ శ్రీను కామెడీ, ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్‌ కూడా ముగుస్తుంది. బ్యాంకుల గురించి హీరో చెప్పే డైలాగ్స్‌ అందరికి ఆలోచింపజేస్తాయి. మహేశ్‌ ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలు ఈ చిత్రంలో బోలెడు ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే...
అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో సూపర్‌ స్టార్‌  మహేశ్‌ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఫైట్స్‌తో పాటు డ్యాన్స్‌ కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్‌ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు.తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఆకతాయి అమ్మాయి కళావతిగా కీర్తి సురేశ్‌ మెప్పించింది. ఇక మహేశ్‌ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రాజేంద్రనాథ్‌ పాత్రకు ప్రాణం పోశాడు ఆయన. వెన్నెల కిశోర్‌ కామెడీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ సంగీతం. పాటలతో తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. కళావతి, మ.. మ.. మహేశా పాటలు అయితే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ని కిర్రెక్కిస్తాయి. మది సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement