
సిద్ధార్థ్ ఇటీవలి చిత్రం చిత్త (తెలుగులో చిన్నా) ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అభినందనలు పొందింది. సిద్ధార్ధ్ కెరియర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా 'చిన్నా' ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది విడుదలైన ఈ సినిమా సౌత్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకుంది.
ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నారు. చిన్నా సినిమాకు గాను 'మ్యాన్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు పరోక్షంగా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. చిన్నా సినిమాను చూసిన కొందరు డిస్టర్బ్ అయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సినిమా చూడలేకపోయామని అన్నారు. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల హిట్ అయిన బాలీవుడ్ సినిమాను కొంతమంది ఎలాంటి ఇబ్బందిలేకుండా చూశారు. కానీ మనసుని హత్తుకునే కథతో చిన్నా సినిమా చేస్తే మాత్రం వారికి ఇబ్బందిగా మారింది. ఇది నిజంగానే సిగ్గుచేటు మనస్తత్వం.' అని సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. యానిమల్ సినిమా పేరు ఎత్తకుండా సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై కొందరి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉందని పేర్కొంటున్నారు.
ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నా సినిమాలో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమాలో నిమిషా సజయన్, సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు.
Siddharth’s strong attack on #Animal 👌
— Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2024
pic.twitter.com/lgO0XD2TuG