'తొమ్మిదో ఏట వివాహం.. అప్పుడు నా భార్యకు మూడేళ్లు' | Singer Ghantasalas Close Aid Sangeetha Rao Last Interview With Sakshi | Sakshi
Sakshi News home page

ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు..మా నాన్నగారి దగ్గర శిష్యరికం ఎలాగంటే..

Published Tue, Jun 8 2021 11:08 AM | Last Updated on Tue, Jun 8 2021 1:45 PM

Singer Ghantasalas Close Aid Sangeetha Rao Last Interview With Sakshi

ఘంటసాల సంగీతం సమకూర్చిన సినిమాల టైటిల్స్‌లో.. ‘సంగీతం – ఘంటసాల, సహాయకులు – పట్రాయని సంగీతరావు’ అని కనిపించేవి.అలా సంగీతరావు పేరు సినీ ప్రేక్షకులకు సుపరిచితం. ఘంటసాల గురువులు పట్రాయని సీతారామశాస్త్రి. వారి కుమారుడే సంగీతరావు.గురువుగారి మీద భక్తి మాత్రమే కాదు, తన ఆలోచలకు తగినవానిగా భావించి ఘంటసాల, సంగీతరావును తనకు సహాయకుడిని చేసుకున్నారు. జూన్‌ 2, 2021 రాత్రి 7 గం. 50 ని.లకు 101 సంవత్సరాల వయసులో సంగీతరావు కన్నుమూశారు.ఈ సందర్భంగా..సంగీతరావు సుమారు నాలుగు మాసాల క్రితం సాక్షికి ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ వివరాలు.

నేను రౌద్రి నామ సంవత్సరంలో పుట్టాను. నా తరవాత ఇద్దరు తమ్ముళ్లు. నారాయణమూర్తి, ప్రభాకరరావు. ఆ తరవాత ఆడపిల్ల పుట్టినప్పుడు అమ్మ నిర్యాణం చెందింది. ఆడపిల్ల కూడా కన్నుమూసింది. ఆ తరవాత మా జీవితం కష్టసాధనం అయింది. మా నాన్నగారికి మమ్మలి పెంచడం కష్టమైంది. నాన్నగారు సాలూరు వచ్చేశారు. అక్కడ మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. అక్కడ మా ముగ్గురు అన్నదమ్ముల్ని మా దొడ్డమ్మ ఓలేటి లక్ష్మినరసమ్మ పెంచింది. ఆవిడ మంచి సమర్థురాలు. ఆవిడకు సాహిత్య జ్ఞానం ఉండేది. ఆవిడ పోయేవరకు మా ఇంట్లోనే ఉంది. అక్కడ చాలామంది సంగీత విద్యార్థులు సంగీతం నేర్చుకోవటానికి నాన్న దగ్గర వచ్చేవారు.

రొంబ నరసింహరెడ్డి అనే విద్యార్థి కూడా వచ్చేవాడు. అతను మంచి వ్యాయామ విశారద. నా చేత కూడా చేయించేవాడు. బాగా పాడేవాడు. హరికథలు కూడా చెప్పేవారు.  మా తాతగారిది కిండ్లాం అగ్రహారం. అది ఆరామద్రావిడ గ్రామం అది. మాదిసంగీత కుటుంబం కావటం చేత బాల్యంలోనే సరళీ స్వరాల దగ్గర నుంచి అన్ని రకాల పాటలు పాడుతూ ఉండటం అలవాటైంది నాకు. మా కుటుంబంలో మా తాతయ్యగారి దగ్గర నుంచి అందరూ ఒక రకమైన భక్తిప్రపత్తులతో ఉండేవారు. విశిష్టంగా పూజలు చేయటం వంటివి ఉండేది కాదు. సహజంగా భగవంతుని మీద భక్తి ఉండేది. తాతగారి శిక్షణలో తాత్విక రచనలు కంఠస్థం అయ్యేవి.

నాగావళి ఒడ్డున...
ఐదో ఏట అక్షారాభ్యాసం చేసినప్పటి నుంచి స్కూల్‌కి వెళ్లడం, ఇంటికి రావడం అలవాటు. నేను చదువుకునే రోజుల్లో చాలా బహుమతులు అందుకున్నాను. అందులో ముఖ్యంగా గుర్తున్నది ఆక్స్‌ఫర్ట్‌ డిక్షనరీ. స్పోర్ట్స్‌లో కూడా బహుమతులు వచ్చాయి. నాగావళి నది బ్రిడ్జి పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్‌లో 1926లో ఒకటో తరగతి శివరావుపంతులు గారి దగ్గర చదివాను. చదువుకున్నాను. ఆ స్కూల్‌ని ఒక పురోహితుల కుటుంబం నడిపేది. ఆ పక్కనే కొబ్బరి ఉండలు అమ్మే దుకాణం ఉండేది. అక్కడ కానీకి మూడు ఉండలు ఇచ్చేవారు.

గ్రామఫోను వింటూ సాధన..
శివరావు పంతులు గారు ఆ గ్రామంలో సంగీతాభిలాష ఉన్నవారికి నాన్నతో సంగీతం చెప్పించడానికి పిలిపించారు. అప్పుడు మేం శ్రీపాద సుబ్బారావు పంతులు గారు అనే పండితుడి ఇంట్లో ఒక భాగంలో ఉండేవాళ్లం. వాళ్లమ్మాయికి నాకు అప్పట్లో నాన్న సరిగమలు చెప్పటం గుర్తుంది. ప్రతి రోజూ నేను స్కూల్‌ నుంచి వస్తున్నప్పుడు ఒక గ్రామఫోను రికార్డు వినేవాడిని. అది విన్నప్పుడు నాకు అత్యాశ్చర్యం వేసింది. ఇంటికి వచ్చి, అమ్మతో, ‘డబ్బాలో నుంచి పాటలు వస్తున్నాయి’ అని చెప్పాను. అప్పుడే గ్రామఫోను రికార్డులు కొత్తగా వచ్చాయి. బిడాలం రాసప్ప అనే ఆయన పెద్ద గొంతుకతో పాడిన పాటలు ఆ రికార్డులో విన్నాను. రాసప్పగారి గ్రామఫోను రికార్డులు వింటూ పాటలు పాడటం అలవాటైంది.

చిన్నతనం నుంచి నేర్చుకోవటం కంటె విని గ్రహించిందే ఎక్కువ. అలా పాడటం అలవాటైంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఎవరు పాడమన్నా గట్టిగా పాడేసేవాడిని. అప్పట్లోనే అక్కడ నాన్నకి కొత్తకొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాల వారు నాన్న చేత సంగీతం చెప్పించుకునేవారు. ఇవి కాకుండా, ఆర్థికంగా శ్రీమంతులు కూడా కొందరు నాన్న దగ్గర సంగీత సాధన చేసేవారు. గరిమెళ్ల గోదావరి శర్మ అనే ఆయన మా నాన్న దగ్గరే సంగీత కృషి చేశారు. ఆయన నాటకాల్లో లెగ్‌ హార్మోనియం వాయించేవారు. ముఖ్యంగా రోషనారా నాటకంలో ఆయన హార్మోనియం ప్రత్యేకం. చిర్రావూరు నరసింహారావు అనే కళాకారుడు రోషనారా వేషం వేసేవారు.

బొబ్బిలి కోటలో...
బొబ్బిలి రాజు గారికి పట్టాభిషేకం జరిగే సమయంలో ఆయన పట్టాభిషేకం  మీద నారాయణశాస్త్రిగారు అనే పండితుడు రాగమాలికలో కృతి రచించి నాతో పాడించారు. బొబ్బిలి రాజావారికి పూజామహల్‌ అని ఒక పూజా గృహం ఉండేది. అక్కడ పూజ సందర్భంలో సంగీతం పాడేవారు మా గురువు గారు. నన్ను కూడా రోజూ తీసుకువెళ్తుండేవారు. ఆ కార్యక్రమానికి వచ్చినవారికి బొబ్బిలి రాజదాసీలు తాంబూలాలు ఇచ్చేవారు. సంభావన కూడా అందించేవారు. ఆరోజుల్లో బొబ్బిలి వైభవోపేతంగా ఉండేది. బొబ్బిలికి దగ్గరలోనే ఆయనకు పట్టాభిషేకం జరిగింది. అక్కడ తాజ్‌మహల్‌లాంటి మహల్‌ ఉండేది. అది ఇప్పటికీ ఉంది. దానిని గెస్ట్‌ హౌస్‌ అనేవారు. బొబ్బిలి రాజా చీఫ్‌ మినిస్టర్‌గా ఉండేవారు. అలా బొబ్బిలిలో ఐదు వరకు చదువుకున్నాను.

రెండు మూడు తరాల పేర్లు...
నాన్నకి ఏదో ఒకటి రాసుకోవటం బాగా అలవాటు. ఆయనను అనుకరించటం చేత మాకూ అదే అలవాటైంది. చిన్నతనం నుంచి పుస్తక పఠనం ఉండేది. మొగలాయి దర్బారు వంటి సంప్రదాయ రచనలు, భయంకర నారీ పిశాచి వంటి డిటెక్టివ్‌ నవలలు అన్నీ చదివేవాడిని. నా పదేళ్ల నుంచి చదివిన జ్ఞాపకం ఉంది. మా మాతామహులు పురాణ శ్రవణం చేసేవారు. అలా భాగవతం పద్యాలన్నీ కంఠస్థం వచ్చాయి. చిన్నప్పటి నుంచి కవీశ్వరుల గురించి వినటం అలవాటు. తిరుపతి వేంకట కవుల గురించి నాన్నగారు చెప్పేవారు. ఇంజరం, యానాము, పల్లెపాలెము అంటూ చెప్పిన పద్యాలు వినేవాడిని. మా తాతయ్య అతి బాల్యం నుంచి భారతరామాయణ భారతాలు చెప్పేవారు. పౌరాణిక గాథలన్నీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయన సహజంగా ఒక అమాయకమైన భక్తుడు కూడాను. అప్పట్లోనే వెంకటపార్వతీశ కవులు, తిరుపతి వెంకట కవులు, వీరేశలింగం,... తెలుగు సాహిత్యంలో ఉండే రెండు మూడు తరాల కవుల పేర్లు తెలుసు.

వివాహం...
మా తల్లి నా చిన్నతనంలోనే గతించారు. నాకు తొమ్మిదో ఏట వివాహం అయిపోయింది. అప్పుడే శారదా బిల్లు అమలులోకి వస్తోంది. ఆ బిల్లు ప్రకారం బాల్య వివాహాలు చేసుకోకూడదు. అందువల్ల ఆ బిల్లు ఇంకా అమలులోకి రాకముందే కిళ్లా అగ్రహారం వాస్తవ్యులు ఆకొండి లింగమూర్తి గారి అమ్మాయితో వివాహం జరిగిపోయింది.  నా వివాహ సమయానికి నా భార్య వయసు మూడేళ్లు. పేరు శ్రీలక్ష్మి.

స్వరపల్లవి గ్రంథం...
అప్పట్లో నాన్నగారు సంచారంలో సంగీత కచేరీలకు తిరుగుతుండేవారు. అక్కడ ఆకొండి నారాయణ శాస్త్రి అనే సంగీత పండితుడు ఉండేవారు. నన్ను ఆయన దగ్గరకు సంగీతానికి పంపించారు. ఆయన వీణ, వయొలిన్‌ వాయించేవారు. బొబ్బిలి గరల్స్‌ స్కూల్‌లో సంగీతం మాస్టారుగా ఉండేవారు. అక్కడ పని చేసే వారికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌కి ఉన్నంత గౌరవం ఉండేది. నేను అక్కడ ‘స్వర పల్లవి’ అనే గ్రంథం గురించి తెలుసుకున్నాను. స్వర పల్లవులు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ఈ స్వర పల్లవులు మిగతా వారు చెప్పేవారు కాదు. ఈ గ్రంథం బొబ్బిలిలో ఉండే ‘వాసా’ వారు రచించారు. ఆ రచనల్నీ వీణ మీద వాయించడానికి వీలుగా ఉండేవి. కల్యాణి రాగం, హిందోళ రాగం కలిపి మొత్తం పది స్వర పల్లవులు చెప్పుకున్నాను. అక్కడే నవరాగ మాలిక వర్ణం కూడా చెప్పుకున్నాను.

సంగీత నిర్వహణ..
నా చిన్నతనం నుంచే సంగీత నృత్య రూపకాలకు సంగీతం చేసే అవకాశం వచ్చింది. క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం, శ్రీనివాస కల్యాణం, హరవిలాసం, కల్యాణ రుక్మిణి వంటి నృత్యరూపకాలకు సంగీతం అందించాను. కూచిపూడి నాటకాలకు బాలాంత్రపు రజనీకాంతరావు, ద్వారం భావనారాయణ, మల్లిక్‌ వంటివారు సంగీతం అందించేవారు. ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకానికి సంగీతం సమకూర్చటం గురించి చర్చ జరిగినప్పుడు బిఎన్‌ రెడ్డిగారు డైరెక్టరుగా ఉన్నారు. ఆయన క్షీరసాగర మథనం, చండాలిక, శాకుంతలం వంటి సంగీత రూపకాలకు నన్ను సంగీతం సమకూర్చమన్నారు. శ్రీనివాస కల్యాణం తరవాత హరవిలాసం, కల్యాణ రుక్మిణి చేశాను.

నాన్నకు శిష్యుడయ్యారు..
1936లో మ్యూజిక్‌ కాలేజీకి ఆదిభొట్ల నారాయణదాసు ఆ తరవాత ద్వారం వెంకటస్వామినాయుడుగారు ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఆయన తరవాత ప్రిన్సిపాల్‌గా అపాయింట్‌ చేయటానికి... ద్వారం నాయుడుగారు ఎనమండుగురిని సెలక్ట్‌ చేశారు. అందులో నాన్నగారు ఉన్నారు. అక్కడ అప్పటికే నాన్నగారు గానకచేరీలు చేస్తుండేవారు. స్థానిక విద్వాంసులంతా నాన్న మీద అభిమానంతో ఉన్నారు. విజయనగరంలో ఉండే వారిని సెలక్ట్‌ చేసుకోవటం మంచిదనే సూచనతో, నాన్న ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఆ సమయంలోనే ఘంటసాల గారు నాన్నకు శిష్యుడయ్యారు.

మద్రాసుకి...
1952లో మద్రాసు వచ్చాను. అప్పుడు ఘంటసాల ‘పరోపకారం’ సినిమా తీస్తున్నారు. నేను ఆయన దగ్గరే ఉన్నాను. ఆయనకు కొన్ని పాటలు పాడి, మళ్లీ విజయనగరం వెళ్లిపోయాను. ఆ తరవాత మళ్లీ 1954లో తిరుపతి వెళ్లాను. అప్పుడు ఘంటసాల గారు నన్ను పిలిపించి, నన్ను ఆయన దగ్గరే ఉండిపోమన్నారు. ఆయన మాట ప్రకారం ఘంటసాలగారితో అక్కడే ఉండిపోయాను. 1971 వరకు కూడా ఘంటసాల గారితో వాళ్లింటోనే ఒక భాగంలో ఉండేవాడిని. 1971 నాటికి ఆయన ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. ఉత్సాహంగా ఉండే వారు కాదు.

కూచిపూడి ఆర్ట్‌ అకాడెమీ...
కూచిపూడి ఆర్డ్‌ అకాడెమీని వెంపటి చిన సత్యం గారు నిర్వహించేవారు.  అక్కడ నన్ను సంగీతం క్లాసులు నిర్వహించమన్నారు. ఘంటసాల గారిని అడిగితే ఆయన ‘ప్రస్తుతం పనులు లేవు కదా! వెళ్లు’ అన్నారు. అలా కూచిపూడి ఆర్డ్‌ అకాడెమీలో చేరి, గాయకుడిగా, వాద్య కారుడిగా వారి దగ్గరే ఉండిపోయాను. 1974లో ప్రవేశించి 2012లో వెంపటి చిన సత్యం గారు పోయేవరకు అక్కడే ఉండిపోయాను. నా జీవితమంతా అక్కడే గడిచిపోయింది. ఘంటసాలగారితో అప్పట్లో జర్మనీ, ఇంగ్లండ్‌ వెళ్లాను. ఆ తరవాత అమెరికా వెళ్లాను. కూచిపూడి ఆర్ట్‌ అకాడెమీలో ప్రవేశించాక యూరప్, హవాయ్‌ ద్వీపాలు, అమెరికాలోని అన్ని ప్రదేశాలు తిరిగాను. అమెరికా, రష్యాలకు ఇండియా ఫెస్టివల్స్‌ జరిగినప్పుడు వెళ్లాను.

ఆహారపు అలవాట్లు...
సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల నా ఆహారపు అలవాట్లు కూడా అవే ఉండేవి. పప్పు, కూర, పచ్చడి, పులుసు, ఊరగాయలు తినేవాడిని. ఆవకాయ, అప్పడాలు, వడియాలతో పాటు,.ఆవకాయలు, నిమ్మకాయ, దబ్బకాయ వంటి సంవత్సరమంతా నిల్వ  ఉండే పదార్థాలన్నీ తినేవాడిని. నా వయసు వాళ్లందరికీ ఇప్పుడు ఉండే స్వీట్ల కంటె...మినప సున్ని, పాకం చలిమిడి వంటి వాటి మీదే మక్కువ ఉండేది. అన్నిరకాల స్వీట్లు తెలిసినా, నేను దేనికోసమూ తాపత్రయ పడినట్లు జ్ఞాపకం లేదు.మా కుటుంబంలో సంగీత సాధన చేసిన మొట్టమొదటి మనిషి మా తాతగారు వెంకటనరసింహశాస్త్రి పట్రాయని. మా ఇంటి పేరు గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పాలి. మా ముందు తర ం వారు ‘పట్రాయుడు’ అని చెప్పేవారట.  మా నాన్న దగ్గర నుంచి ‘పట్రాయని’ గా మారింది. ఒకాయన చేత శతావధానం చేయించారు మా నాన్న. ఆయన మా ఇంటి పేరు విని, ఇంటి పేర్లు ద్వితీయా విభక్తిలో ఉండాలి అన్నారట. దానితో మా ఇంటి పేరు పట్రాయుడు నుంచి పట్రాయనిగా మారింది.

ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు
అరవయ్యేళ్ల తరవాత కూడా నేను వార్ధక్యం వచ్చిందనుకోలేదు. తొంభయ్యేళ్లు వచ్చిన తరవాత కూడా వార్ధక్యం వచ్చిందన్న అనుభూతి లేదు. ఈ మధ్యనే అంటే వందేళ్లు నిండిన తరవాత క్రమేపీ దృష్టి అవి తగ్గుతుంటే, ‘ఏమిటీ ఇలా ఉన్నాను’ అనే భావన కలుగుతోంది.మా చిన్నతనంలో సాలూరులో ప్రతి సంవత్సరం కలరా వచ్చేది. ఆ వ్యాధితో పోయిన వారిని సన్నాయి మేళంతో తీసుకువెళ్లేవారు. నేను రెండు మూడు క్లాసులు చదువుత్ను రోజుల్లో ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువ ఉండేది. నేను మద్రాసు వచ్చేదాకా కూడా ఈ వ్యాధి ఉన్నట్టు గుర్తు. మీజిల్స్‌ వ్యాధి చాలా సార్లు వచ్చింది. ఆ రోజుఎల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులుండేవారు. సాలూరులో రాజకుంటుంబాలకు సంబంధించిన ఒక వైద్యుడు ఉండేవారు. చాలా మంచి మనిషి. ఆయనకు ఒక ఆశ్రమం కట్టిచ్చారు. అందులోనే ఒక  కొట్లో ఉండేవారు. ఆయన ఏదో మందు ఇస్తూ ఉండేవారు. ఎవ్వరినీ కానీ కూడా అడిగేవారు కాదు. కాని అక్కడకు వచ్చినవారు ఒక కానీ ఇచ్చేవారు. ఆయన చనిపోయిన తరవాత చూస్తే రెండు బస్తాల కాన్లు వచ్చాయి. సాలూరు ప్రాంతంలో అడ్డసరం చెట్లు ఎక్కువగా ఉండేవి. అవి వైద్యానికి బాగా ఉపయోగపడేవి. వాటి ఆకులను పుటం పెట్టి, ఆ కషాయం తాగితే దగ్గు బాగా తగ్గుతుందనేవారు.

ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు
నా చిన్నతనంలో డిస్ట్రిక్ట్‌ కలెక్టర్లు తెల్లదొరలే ఉండేవారు. స్వాతంత్రం వచ్చేనాటికి నేను సంసారంలో ప్రవేశించాను. అప్పుడు కలివెరలో ఐదేళ్లున్నాను. తమ్మినేని పాపారావు అన్నాయన ఆ గ్రామానికి ఎంఎల్‌ఏగా ఉండేవారు. స్వతంత్ర సాధన గురించి రాజకీయాలు ఎక్కువగా ఉండేవి. చాలామంది అరెస్టులు అవుతుండేవారు. అల్లర్లు జరిగాయి. రాజకీయ పోరాటాలు జరిగాయి. ఆ రోజుల్లోనే ఘంటసాల అరెస్టు అయ్యారు. అప్పట్లో ఆయన రోడ్డు మీదకు వెళ్లి అల్లర్లకు సంబంధించి పాటలు పాడేవారు.1936లో జరిగిన ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ పోటీ చేసింది. సాలూరు నుంచి పోటీ చేసిన వి. వి. గిరి గారు పోటీ చేశారు. ఆయనకు పోటీగా బొబ్బిలిరాజు నిలబడ్డారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వి. వి. గిరిగారు, అక్కడ ఉన్న పేరయ్య హోటల్‌లో భోజనం చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే గెలిచారు.
– సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement