సీరియల్‌ సెట్‌లో గర్భస్రావం.. వెళ్లనివ్వలేదు, డ్రామా అన్నారు | Smriti Irani Recalls Miscarriage on Kyunki Saas Bhi Kabhi Bahu Thi Sets | Sakshi
Sakshi News home page

Smriti Irani: గర్భం దాల్చిన విషయం తెలియదు, కానీ సెట్‌లోనే రక్తస్రావం.. ఎవరూ నమ్మలేదు

Published Sun, Mar 26 2023 9:31 PM | Last Updated on Sun, Mar 26 2023 9:32 PM

Smriti Irani Recalls Miscarriage on Kyunki Saas Bhi Kabhi Bahu Thi Sets - Sakshi

స్మృతి ఇరానీ.. రాజకీయాల్లోకి రావడానికి ముందు నటిగానే సుపరిచితురాలు. క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎక్కువ పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ సీరియల్‌ నిర్మాత పండిత్‌ జనార్ధన్‌ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది స్మృతి. ఈ ధారావాహిక శోభాకపూర్‌, ఏక్తాకపూర్‌ బ్యానర్‌లో నిర్మితమైంది. ఈ సీరియల్‌ సెట్‌లో స్మృతి ఇరానీకి గర్భస్రావమైంది.

తాజాగా ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌ షూటింగ్‌ చేస్తున్న రోజులవి.. అప్పుడు నేను గర్భవతినన్న విషయం నాకూ తెలియదు. ఓరోజు కొంత అస్వస్థతగా అనిపించడంతో ఇంటికి వెళ్తానని చెప్పాను. కానీ వెళ్లలేకపోయాను. షూటింగ్‌లోనే ఉండిపోయాను. తీరా సాయంత్రం అయ్యాక వెళ్లమని చెప్పారు. నేను బయలుదేరానో లేదో రక్తస్రావం మొదలైంది. నాకింకా గుర్తుంది, ఆరోజు బాగా వర్షం పడుతోంది. వెంటనే ఒక ఆటోను పిలిచి ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాను. అక్కడికి వెళ్లగానే ఓ నర్సు వచ్చి ఆటోగ్రాఫ్‌ అడిగింది. ఓ పక్క రక్తస్రావమవుతున్నా ఆటోగ్రాఫ్‌ ఇచ్చాను. గర్భస్రావం అవుతున్నట్లుంది. ముందు నన్ను అడ్మిట్‌ చేసుకోండి అని అడిగాను. ఇంత జరిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం అవసరం. కానీ అది అంత ఈజీ కాదని నాకు తెలుసు.

క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌లో దాదాపు 50 ముఖ్య పాత్రలున్నాయి. వాటితో సీరియల్‌ను ముందుకు తీసుకెళ్లొచ్చు. అయినప్పటికీ వాళ్లు నేను రావాల్సిందేనని వెంటపడ్డారు. తీరా సెట్స్‌కు వెళ్లాక నా గర్భస్రావం అంతా బూటకం అంటూ పుకారు పుట్టించారు. ఏక్తా కపూర్‌ కూడా అదే నిజమనుకుంది. నా ఇంటి ఈఎమ్‌ఐ కట్టాలంటే డబ్బులు కావాలి. దానికోసమే నేను హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాతి రోజే సెట్స్‌లో జాయిన్‌ అయ్యా. అది ఎవరూ నమ్మలేదు. అందుకే మరుసటి రోజే నా మెడికల్‌ పేపర్స్‌ పట్టుకొచ్చి ఏక్తాకు చూపించి నేనేమీ డ్రామా చేయడం లేదని చెప్పాను. అప్పుడుకానీ తనకు నిజం అర్థం కాలేదు' అని చెప్పుకొచ్చింది స్మృతి ఇరానీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement