వెండితెరపై మెరుపుతీగలా కనిపించే హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే బొద్దుగా కనిపించడానికి కూడా వెనకాడరు. అందుకు తాజా ఉదాహరణ సోనాక్షీ సిన్హా, హ్యుమా ఖురేషీ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన ‘డబుల్ ఎక్స్‌ఎల్’ చిత్రం ఈరోజు రిలీజవుతోంది. అధిక బరువుతో హేళనకు గురయ్యే ఇద్దరి అమ్మాయిల కథతో ఈ సినిమా ఉంటుంది. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఈ విషయాన్ని వినోదాత్మకంగా చెబుతూ చాలా జాగ్రత్తగా డీల్ చేశారట చిత్రదర్శకుడు సత్రమ్ రమణి.
‘బాడీ షేమింగ్’ తప్పనే సందేశం కూడా ఈ చిత్రంలో ఉంది. ఈ చిత్రం కోసం సోనాక్షి, హ్యూమా పదిహేనేసి కిలోల బరువు పెరిగారు. నిజానికి కెరీర్ ఆరంభంలో సోనాక్షి బొద్దుగానే ఉండేవారు. ‘దబాంగ్’ చిత్రంతో పరిచయం కాకమునుపు ఆమె దాదాపు 90 కిలోలు ఉంటే.. 30 కిలోలు తగ్గి ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అప్పటినుంచి దాదాపు అదే బరువుతో కొనసాగుతున్నారామె. ఇప్పుడు ‘డబుల్ ఎక్స్‌ఎల్’కి బరువు పెరిగిన విషయం గురించి సోనాక్షి మాట్లాడుతూ.. ‘‘బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో అయితేనే సేఫ్. కానీ ‘డబుల్ ఎక్స్‌ఎల్’ నాకు అలా తగ్గేంత సమయం ఇవ్వలేదు.
రెండే నెలల్లో పెరగాల్సి వచ్చంది. దాంతో ఏది పడితే అది తిన్నాను. ఎన్నో ఏళ్లుగా చేస్తూ వచ్చిన వర్కవుట్లు మానేశాను. ఫలితంగా 15 కిలోలు పెరిగాను. కానీ ఇలా పెరిగితే కష్టాలు తప్పవు. వర్కవుట్లు చేయకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా నా ఒత్తిడిని పెంచింది. అంతకు ముందులా యాక్టివ్‌గా ఉండలేకపోయేదాన్ని. అదే కొంచెం సమయం తీసుకుని, ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరిగి ఉంటే.. ఇలా ఉండేది కాదు. అందుకే తగ్గాలన్నా, పెరగాలన్నా పద్ధతి ప్రకారమే చేయండని సలహా ఇస్తున్నాను. ఇక, ఈ సినిమా పూర్తి కాగానే.. ఎక్కువ టైమ్ తీసుకుని, చక్కగా తగ్గడం మొదలుపెట్టాను. అది బాగా అనిపించింది’’ అన్నారు.
హ్యూమా ఖురేషీ మాట్లాడుతూ.. ‘‘అధిక బరువు అనేది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పోగొడుతుంది. అయితే మనం ఎలా కనిపిస్తున్నాం అనేదాని కన్నా ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నామన్నదే ముఖ్యం. మన ప్రవర్తన బాగుంటే అదే అందం. అయితే ఆరోగ్యం కోసం తగ్గాలనుకుంటే తగ్గొచ్చు. ఎవరో ఏదో అంటారని కాదు. అమ్మాయిల బాడీ షేప్‌ని హేళన చేయడం సరికాదు. ఇక ఒక సినిమా కోసం బరువు పెరగడం అనేది ఓ సవాల్. ఆరోగ్యకరమైన పద్ధతిలో పెరగకపోతే కష్టాలు మాత్రం తప్పవు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment