నేను ఉన్నా లేకున్నా.. అక్కా, చెల్లిని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి. వాళ్లకు అన్ని విషయాల్లో నువ్వు అండగా నిలవాలి. వాళ్లను ప్రయోజకుల్ని చేయాలి. వారికి భరోసా ఇవ్వాలంటూ చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు మదిలో నాటుకుపోయాయంటూ గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటుడు, ప్రజల గుండెల్లో హీరో సోనూసూద్.. అక్క మౌనిక, చెల్లి మాళవిక(గున్నూ)లు నా రెండు కళ్లు.. రక్షా బంధన్ వస్తుందంటే మా ముగ్గురిలో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.. ముగ్గురం ఎంతో సంతోషంగా గడుపుతాం..’ అంటూ పలు విషయాలను ‘సాక్షి’తో ముచ్చటించారాయన..
విలన్ పాత్రలతో వావ్ అనిపిస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్.. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో సేవలు అందించి ప్రజల గుండెల్లో హీరో అయ్యారు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోనూసూద్ పేరు మార్మోగిపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయనపై ఎంతో అభిమానం పెంచుకున్నారు. ప్రతి రక్షాబంధన్ సమయంలో తాను మాత్రం అక్క మౌనిక, చెల్లి మాళవికతోనే ఉంటారు.. అక్కా, చెల్లీ ఇద్దరూ ఆయనకు రెండు కళ్లు.. రక్షా బంధన్ సందర్భంగా బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’ పలకరించింది.. ఈ సందర్భంగా వారు తమ మనసులోని భావాలను వ్యక్తపరిచారు..
అక్కాచెల్లెలు.. నా రెండు కళ్లు
రాఖీ పండగ వస్తుందంటే చాలు ఎక్కడ లేని ఆనందం. అక్క మౌనిక, చెల్లి మాళవిక (గున్నూ) నాకు రక్షాబంధన్ కడతారు. వీళ్లిద్దరూ నాకు రెండు కళ్లలాంటి వారు. ‘నేను ఉన్నా లేకున్నా అక్కను, చెల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలి’ అని అమ్మ చెప్పిన మాటలు నా మదిలో నాటుకుపోయాయి. అందుకే వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాను. వాళ్ల మనసుల్ని అర్థం చేసుకుంటాను. ప్రస్తుత కరోనా పరిస్థితులో దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులందరికీ నేను ఒక పెద్దన్నను కావడం నాకెంతో సంతృప్తినిస్తోంది. ఈ రాఖీ పండగ రోజున అక్కను, చెల్లిని ప్రత్యేకంగా సర్‌ప్రైజ్ చేయాలని డిసైడయ్యాను. ఆ విషయాలను సోషల్ మీడియా ద్వారా అందరికీ చెబుతా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు
ఆ ఇద్దరికీ నేను రక్షకుడిని
అక్క అంటే గౌరవం, ప్రేమ.. చెల్లి గున్నూ అంటే పంచ ప్రాణాలు.. చిన్నప్పటి నుంచి వారికేదైనా చిన్న సమస్య ఎదురైనా నేను ఆ సమస్యకు ఎదురు నిలబడేవాడ్ని. ఇద్దరూ ప్రతి ఒక్కటీ నాతో షేర్ చేసుకునేవాళ్లు. ఆ ఇద్దరికీ నేను రక్షకుడినే కాదు.. ఆ ఇద్దరూ నాకు రెండు కళ్లు..
పంజాబ్ టూ ముంబై..
చెల్లి నేనూ ఒకేచోట ఉండేవాళ్లం.. ప్రతి రక్షా బంధన్‌కు అక్క మౌనిక నేను ముంబైలో ఉంటే తను పంజాబ్ నుంచి వచ్చేది.. ఇలా నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టి నన్ను సర్‌ప్రైజ్ చేసేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలుగా ప్రతి రాఖీకి పంజాబ్ టూ ముంబై ట్రావల్ చేస్తూ.. నన్ను సర్‌ప్రైజ్ చేసేది.
Comments
Please login to add a commentAdd a comment