
పెళ్లి కాకుండానే గర్భవతి అయినందుకు నన్ను నిందిస్తారన్న భయంతో ఈ విషయాన్ని అందరితోపాటు, ఆఖరికి నా తల్లిదండ్రుల దగ్గర కూడా దాచిపెట్టాను..
Anmol Chaudhary: హిందీ మోడల్, సోషల్ మీడియా స్టార్ అన్మోల్ చౌదరి తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సింగిల్ మదర్‌గా వాడి ఆలనాపాలనా చూసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్మోల్ చౌదరి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో తను ఓ వ్యక్తిని ప్రేమించానని, అతడితో రెండేళ్లపాటు సహజీవనం చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో గతేడాది తను గర్భం దాల్చానని, అబార్షన్ కూడా చేయించుకోవాలనుకున్నామని తెలిపింది. కానీ అంతలోనే తన మనసు పేగు బంధం మీద ప్రేమ పెంచుకోవడంతో బిడ్డ ఊపిరి తీయలేకపోయానంది. సెప్టెంబర్‌లో ఆ పసికందు ఈ లోకంలోకి అడుగు పెట్టేసరికే ప్రియుడు తనతో బంధాన్ని తెంచుకుని వెళ్లిపోయాడని ఉద్వేగానికి లోనైంది.
"బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ వల్ల గర్భం దాల్చాను. కడుపులో ఉన్న బిడ్డను వదిలించుకోమని నా మాజీ ప్రియుడు సలహా ఇచ్చాడు. కానీ నేను అందుకు ఒప్పుకోలేదు. పసికందును పొత్తిళ్లలోకి తీసుకుని అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఆశపడ్డాను. అదేమాట అతడితో చెప్పాను. అతడికేనా.. నేను గర్భవతిని అన్న విషయాన్ని ఫొటోతో సహా ప్రపంచానికి చెప్పాలనుకున్నాను. కానీ నిస్సహాయత వల్ల అలా చేయలేకపోయాను. అతికొద్దిమందికి మాత్రమే నేను గర్భం దాల్చానని తెలుసు. ఆఖరికి నా పేరెంట్స్‌కు కూడా ఈ విషయం తెలీదు."
"పెళ్లి కాకుండానే గర్భవతి అయినందుకు నన్ను నిందిస్తారన్న భయంతో ఈ విషయాన్ని అందరితోపాటు, ఆఖరికి నా తల్లిదండ్రుల దగ్గర కూడా దాచిపెట్టాను. మరోపక్క నేను లావెక్కుతున్నానని జనాలు నన్ను అవమానించడం మొదలు పెట్టారు. నా కడుపులో పిల్లాడు ప్రాణం పోసుకుంటున్నందువల్లే నేను లావయ్యానని గట్టిగా అరిచి వాళ్ల నోళ్లు మూయించాలని ఉండేది. కానీ అప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాను. ఆ సమయంలో నా సోదరి నాకు అండగా నిలబడింది. డెలివరీ సమయంలో కూడా తనే దగ్గరుంది"
"ఇవన్నీ చూశాక స్వంతంగా నా కాళ్ల మీద నేను నిలబడాలని నాకు తెలిసొచ్చింది. సరిగ్గా అప్పుడే నా మాజీ ప్రియుడు నాకు సాయం చేస్తానంటూ మాట కలిపాడు. కానీ ఎందుకు? నేనెక్కడ తన పేరును బయటపెడ్తానోనన్న భయం అతడిని ముందుకు వచ్చేలా చేసింది. నా బేబీకి తల్లిదండ్రులు ఉండాలన్న ఆశతో మేం మళ్లీ కలిసిపోవాలనుకున్నాం, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అవివాహిత ఒంటరి తల్లిగా బాబును పెంచుతున్నా. ఇప్పటికైనా నా మాజీ ప్రియుడు నా కొడుకును కలవాలనుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు" అని అన్మోల్ చౌదరి చెప్పుకొచ్చింది. ఇటీవలే బాబు ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె నోయిడాలో తన సోదరితో కలిసి నివసిస్తోంది. ఆమె గతంలో 2007లో వచ్చిన స్ప్లిట్స్‌విల్లా పదో సీజన్‌లో పాల్గొంది.