కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని కల్చరల్ ఫెస్ట్‌లో తొలి రోజు శుక్రవారం లెట్స్‌టాక్ ప్రోగ్రాంలో యాంకర్ సుమ కనకాల సందడి చేశారు. ‘చమ్కీల అంగిలేసి ఓ వదినె’ అంటూ డ్యాన్స్‌తో ఆమె ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు దంపతులు, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ కో–ఆరి్డనేటర్ హీరాలాల్, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా.. స్ప్రింగ్‌స్ప్రీ కోర్ టీం కో–ఆరి్డనేటర్ జీవన్‌రెడ్డి నాలుగు రౌండ్లలో యాంకర్ సుమను అడిగిన ప్రశ్నలకు ఆమె ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాలివే..
కేరళ అయినా స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు?
మానాన్న నారాయణ్ కుట్టి, అమ్మ విమల కుట్టి. నేను ఏకైక సంతానాన్ని. నాన్న రైల్వే ఉద్యోగి. ఉద్యోగంలో భాగంగా కేరళ నుంచి హైదరాబాద్ లాలాగూడకు వచ్చి సెటిల్ అయ్యాడు. నా స్వస్థలం కేరళ అయినా.. నేను పక్కా తెలంగాణ, హైదరాబాదీ అమ్మాయిని. నా కు లాలాగూడ రైల్వే డిగ్రీ కళాశాల అంటే ఇష్టం. నేను యాక్టింగ్, ప్రొడ్యూసింగ్, సామాజిక సేవ చేస్తున్నా. నా తొలి ప్రాధాన్యం యాంకరింగ్‌కే.
అంత చిన్నవయసులో బుల్లితెరకు ఎలా వచ్చారు?
సుమ: నాన్న రైల్వే ఉద్యోగంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కల్చరల్ ఈవెంట్‌లో చాందిని సినిమాలో శ్రీదేవి నటించిన ‘మేరే హతోమే నౌనౌ చూడియా’ పాటకు డ్యాన్స్ చేశాను. అక్కడ అప్పుడు నన్ను చూసిన దూరదర్శన్ నిర్వాహకులు నాకు సీరియల్‌లో ఛాన్స్ ఇచ్చారు. 1991లో 15 ఏళ్ల వయస్సులోనే బుల్లితెరతో నా కలల ప్రయాణం ప్రారంభమైంది.
ఇష్టమైన సెలబ్రిటీలు?
తల్లిదండ్రులే మనకు మొదటి సెలబ్రిటీలు. మా అమ్మ నాకు కూచిపూడి నృత్యం నేర్పించడం వల్లే నాట్యం, యాక్టింగ్‌పై పట్టు సాధించి యాంకర్‌గా రాణిస్తున్నా. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతీ కళాశాలలో కల్చరల్ టీం ఉండాలి. నిట్ వరంగల్ కల్చరల్ టీం ఉండడమే కాకుండా కల్చరల్ ఫెస్ట్‌ను ప్రత్యేకంగా నిర్వహించడం.. అందులో భాగంగా నేను రావడం చాలా ఆనందంగా ఉంది.
యాక్టింగ్‌తో పాటు సమాజానికి ఏం చేస్తున్నారు?
విద్యార్థులు విద్యనభ్యసించి ఉత్తమ స్థాయికి చేరుకోవాలి. ప్రతి ఒక్కరం మన బాధ్యతగా సమాజానికి సేవ చేయాలి. నేను ఏడేళ్ల క్రితం ఖమ్మంలో ప్రారంభించిన ఓల్డేజ్ హోమ్‌కు పవన్ కల్యాణ్‌తోపాటు ప్రభాస్ ఎంతో సాయం చేశారు. త్వరలో నేను హైదరాబాద్‌లో ప్రారంభించే వంద పడకల ఓల్డేజ్ హోమ్‌కు మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. ఫెస్టివల్ ఫర్ జాయ్(ఎఫ్‌ఎఫ్‌జే) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాను. అనాథలకు సైతం పండుగ సంతోషాన్ని అందజేస్తున్నాను.
భద్రకాళి మాతకు పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శుక్రవారం యాంకర్ సుమ ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment