యాభై ఏళ్ళ క్రితం సినిమా.. కౌబాయ్ కథలకు క్రేజు తెచ్చిన హిట్ సినిమా. హాలీవుడ్ కథాంశానికి తెలుగుదనం అద్ది, మళ్ళీ హాలీవుడ్‌కే వెళ్ళిన సినిమా. అప్పటికి ఏడేళ్ళుగా సినీరంగంలో ఉన్న కృష్ణను స్టార్‌ని చేసిన సినిమా. నిర్మాతగా నిలబెట్టిన సినిమా. దాస్ దర్శకత్వంలో కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు పక్కా ప్రణాళికతో వచ్చిన ‘మోసగాళ్ళకు మోసగాడు’కు నేటితో 50 ఏళ్ళు.
ఒకే రకమైన జానపదాలు, పౌరాణిక చిత్రాలతో జనానికి విసుగెత్తుతున్న కాలం అది. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు తారలుగా స్థిరపడిపోయి చాలా కాలం అవడంతో, యువ నవ తారలకు అవకాశాలు తెరుచుకున్న సమయం. కృష్ణ, శోభన్‌బాబు లాంటి నటులు ఆ అవకాశాలను అందుకోవాలని తపిస్తున్న తరుణం. ఆ పరిస్థితుల్లో ఇంగ్లీషు, హిందీ చిత్రాల స్ఫూర్తితో తెలుగు సినిమా సైతం క్రైమ్, యాక్షన్ తరహా చిత్రాలవైపు మొగ్గింది. అలాంటి కథల అన్వేషణలో తెలుగు మసాలాతో వండిన పాశ్చాత్య కౌబాయ్ వంట ‘మోసగాళ్ళకు మోసగాడు’.
ఇంగ్లీష్ నుంచి హిట్ కథ!
1970 నాటికి కృష్ణ 40కి పైగా సినిమాలు చేశారు. కానీ, యాక్టర్ నుంచి స్టార్ హోదా కల్పించే చిత్రాలు చేయలేకపోతున్నాననే అసంతృప్తి కలిగింది. పెద్దమ్మాయి పేరు మీద ‘శ్రీపద్మాలయా మూవీస్’ నెలకొల్పారు. తొలి చిత్రం ‘అగ్ని పరీక్ష’ (1970) ఆడలేదు. పట్టుదల పెరిగింది. అదే సమయంలో ‘మెకన్నాస్‌గోల్డ్’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి హాలీవుడ్ చిత్రాలు మద్రాసులో సంచలనం రేపుతున్నాయి. వాటిని కలగలిపి, కొత్త వంట చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు వాతావరణానికి తగ్గట్లు వండే బాధ్యతను రచయిత ఆరుద్రకు అప్పగించారు. అలా ఆరుద్ర రాసిన కథ ‘అదృష్టరేఖ’. అదే మాస్ కోసం ‘మోసగాళ్ళకు మోసగాడు’గా టైటిల్ మార్చుకొని, కృష్ణ అదృష్టాన్ని మార్చేసిన కథ. కె.ఎస్.ఆర్. దాస్ ‘రౌడీ రాణి’ (1970) చిత్ర విజయంతో మంచి జోరు మీదున్నారు. దాంతో, ఆయనను డైరెక్టర్‌గా ఎంచుకున్నారు.
రాజస్థాన్ ఎడారుల్లో... సాహసోపేతంగా...
ప్రేమికులైన హీరో హీరోయిన్లు తమ తండ్రులను చంపినవారిపై ఎలా పగ సాధించుకున్నారనేది ఈ చిత్ర కథ. హంతకులెవరో కనిపెట్టి, వారిని వెంటాడి, వేటాడే ఈ క్రైమ్ ఫార్ములాకు అమూల్యమైన నిధి కోసం అన్వేషణ, దాన్ని శోధించి సాధించడం, ప్రజల పరం చేయడం ఆసక్తికరమైన పైపూత! ఎడారుల్లో ఒంటెల మీద ప్రయాణం, గుర్రాల మీద ఛేజింగులు, పేలే తుపాకులు, కాలే ఇళ్ళు, దుర్గమ ప్రాంతాల్లో ప్రయాణాలు, సరసాలు, సరదాలు, వినోదాలతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, చకచకా సాగిపోయే కథాకథనం ఈ చిత్రాన్ని స్పెషల్‌గా నిలిపాయి. 1971 జనవరి 9న వాహినీ స్టూడియోలో ఈ సాహస గాథ చిత్రీకరణ మొదలైంది. ఈ కథను చిత్రీకరించిన తీరు కూడా సాహస గాథే.
అప్పట్లో కృష్ణ సినిమాలను మూడు, నాలుగు లక్షల బడ్జెట్‌లో తీసేవారు. కానీ ఈ చిత్రానికి అంతకు రెట్టింపు మొత్తాన్ని ఖర్చు చేశారు. ‘‘సిమ్లా, రాజస్థాన్‌లోని బికనీర్, మద్రాసు, పాండిచ్చేరీల్లో తీశాం. ఎడారి దృశ్యాలను రాజస్థాన్‌లోని కోటా అనే చోట శ్రమపడి చిత్రీకరించాం’’ అని కృష్ణ చెప్పుకొచ్చారు. కథానాయిక రాధ పాత్ర పోషించిన విజయనిర్మల సైతం కెరీర్‌లో ఎంతో కష్టపడి నటించిన సినిమా ఇదనేవారు. ‘‘ఎన్నడూ అలవాటు లేని ఫైట్లు, గుర్రపుస్వారీ చేయాల్సి వచ్చింది. నేను, కృష్ణ గారు, నాగభూషణం గారు రోజూ మద్రాసు మెరీనా సముద్రతీరంలో స్వారీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం’’ అని స్వర్గీయ విజయనిర్మల గతంలో ఈ వ్యాసకర్తకు చెప్పారు.
‘‘ఈ చిత్ర నిర్మాణం కోసం కృష్ణ ఎంతో శ్రమపడ్డారు. యూనిట్ సభ్యులందరినీ రైళ్ళలో ఢిల్లీకి తీసుకువెళ్ళి, అక్కడ గదులు బుక్‌చేసి, అక్కడ నుంచి సిమ్లాకు తీసుకువెళ్ళారు’’ అని కృష్ణ కెరీర్ తొలి రోజుల నుంచి ఆయనకు సన్నిహితులైన జర్నలిస్టు స్వర్గీయ మోహన్‌కుమార్ చెప్పారు. థార్ ఎడారిలో మనుషులు తిరగని, మంచినీళ్ళు కూడా దొరకని చోట షూటింగ్ చేశారు. బికనీర్ కోటలో, సట్లెజ్ నదీ తీరంలోని తట్టాపానీలో తీశారు.
ముఖంపై పొక్కులకు... మేకప్ మహిమ
విలన్లు ఎడారిలో వదిలేసి వెళ్ళినప్పుడు, తాగడానికి నీళ్ళయినా లేక ఎండలో మాడిపోయి హీరోకు ముఖమంతా పొక్కులు వచ్చినట్లు చూపించే సన్నివేశం కోసం కృష్ణ వ్యక్తిగత మేకప్‌మ్యాన్ సి. మాధవరావుకు చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. దగ్గరలోనే బఠాణీలు దొరికితే తెప్పించారు. ఆ బఠాణీల పైన పొరలా ఉండే, తొక్కు తీయించారు. ఆ తొక్కులను హీరో కృష్ణ ముఖంపై అంటించారు. ముఖంపై పొక్కుల ఎఫెక్ట్ వచ్చింది. సాంకేతిక నిపుణులు చూపిన అలాంటి సమయస్ఫూర్తి, ‘గుడ్, బ్యాడ్, అగ్లీ’లోని ‘అగ్లీ’ పాత్ర స్ఫూర్తితో మలచిన నక్కజిత్తుల నాగన్న (నటుడు నాగభూషణం) పాత్రచిత్రణ లాంటి మేకింగ్ విశేషాలు నేటికీ ఓ పెద్ద కథ.
చక్రపాణి జోస్యం తప్పింది! ఎన్టీఆర్ అన్నట్టే అయింది!!
ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు నిరుత్సాహపరిచినవారూ లేకపోలేదు. ప్రముఖ నిర్మాత చక్రపాణి ఒకసారి షూటింగ్‌కి వచ్చారు. సెట్‌లోని కౌబాయ్ వాతావరణం, గెటప్‌లు చూసి, ఆయన పెదవి విరిచారు. జనం మెచ్చరని తన అంచనా అడక్కుండానే చెప్పేశారు. అప్పటికే సగానికి పైగా సినిమా అయిపోయింది. దాంతో, కృష్ణ బృందం ముందుకే సాగారు. తొలి కాపీ వచ్చాకా ప్రివ్యూలు చూసినవారెవరూ, సరైన అంచనా చెప్పలేకపోయారు. హీరో ఎన్టీఆర్ మాత్రం ‘బావుంది బ్రదర్. విభిన్న మాస్‌ఫిల్మ్ తీశారు. స్త్రీలు చూడరు. ఫస్ట్‌రిలీజ్ కన్నా, రీ–రిలీజుల్లో ఎక్కువ డబ్బు వస్తుంది’ అన్నారు. సరిగ్గా ఆయన అన్నట్లే అయింది. 1971 ఆగస్టు 27 బెంగళూరు సహా తెలుగునాట 27 కేంద్రాల్లో, 35 ప్రింట్లతో’’ రిలీజై, హిట్టయింది.
ఇంగ్లీష్ డబ్బింగ్‌తో విదేశాలకు...
పూర్తిగా ‘‘ఈస్ట్‌మన్‌కలర్‌లో నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా డైరెక్టర్, కెమేరామ్యాన్ల ఫిల్మ్. కెమేరాకోణాల్ని స్వామి ఎంత వేగంగా మారుస్తూ వెళ్ళారో, సన్నివేశాల్ని దాస్ అంతే వేగంగా నడిపించారు. ఫలితంగా చిత్రంలోని లోటుపాట్లు చటుక్కున ఎవరికీ తట్టలేదు. ఆదినారాయణరావు నేపథ్య సంగీతం, ‘కోరినది దరి చేరినది..’ డ్యూయట్ పాపులర్. అప్పటికి ప్రధాన పాత్రలకే పరిమితమైన శాస్త్రీయ నర్తకి, నటి రాజసులోచనతో ‘సిగ్గేలా మగాడికీ’ అంటూ శృంగారనృత్యం చేయించడం విశేషం!
తమిళంలో ‘మోసక్కారనుక్కు మోసక్కారన్’గా, హిందీలో ‘గన్‌ఫైటర్ జానీ’ పేరుతో, ఇంగ్లీషులో ‘ది ట్రెజర్‌హంట్’గా ఈ చిత్రం అనువాదమైంది. ‘‘ఇంగ్లీషు డబ్బింగ్ రూపం గల్ఫ్‌దేశాలు, సింగపూర్, కౌలాలంపూర్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలన్నిటిలో కలిపి దాదాపు 80 దేశాల్లో విడుదలైంది’’ అని కృష్ణ తెలిపారు. ఈ హిట్ ప్రేరణతో దాదాపు 15 కౌబాయ్ చిత్రాల్లో కృష్ణ నటించారు. కృష్ణ కుమారుడైన మహేశ్‌బాబుతో ఇదే జానర్‌లో ‘టక్కరి దొంగ’ (2002) వచ్చింది. ఆధునిక టెక్నాలజీతో, హాలీవుడ్ కౌబాయ్‌ల లొకేషన్లలో తీశారు. కానీ, ఇవేవీ తొలి విజయాన్ని మరిపించలేకపోయాయి. ఇవాళ్టికీ తెలుగులో కౌబాయ్ హీరో అంటే కృష్ణే! కౌబాయ్‌ఫిల్మ్ అంటే ‘మోసగాళ్ళకు మోసగాడే’!
– రెంటాల జయదేవ
⇔హీరో కృష్ణతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4.30కు, తిరిగి రాత్రి 11.30 గం.కు.
Comments
Please login to add a commentAdd a comment