సాక్షి, చెన్నై: సూర్య సినీ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం జై భీమ్. జ్యోతిక, సూర్య కలిసి 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గిరిజన వాసుల జీవన విధానాన్ని, వారి సమస్యలను ఆవిష్కరించే యథార్ధ కథాంశంతో రూపొందింది. ఇందులో నటుడు సూర్య ప్రముఖ న్యాయవాది చంద్రు పాత్రలో నటించి గిరిజనుల తరఫున న్యాయం కోసం పోరాడిన విషయం తెలిసిందే.
చదవండి: ఓటీటీకి వచ్చేసిన బ్రహ్మాస్త్ర మూవీ, అక్కడ అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్
ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 4వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ టైం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకుని, పలు అవార్డులను గెలుచుకుంది. కాగా ఆ చిత్ర కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ కానుందన్నది తాజా సమాచారం. నటుడు సూర్య కథానాయకుడిగా దర్శకుడు జ్ఞానవేల్ మరోసారి జై భీమ్ చిత్రం తరహాలో ఒక యథార్థ సంఘటనను ఇతివృత్తంగా తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని సూర్య, జ్యోతికల నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించనుందని సమాచారం.
చదవండి: బరువు పెరగడం ఓ సవాల్‌గా అనిపించింది: హీరోయిన్
ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు గురువారం మొదలైనట్లు తెలిసింది. ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించినట్లు సమాచారం. కాగా అంతకుముందు దర్శకుడు జ్ఞానవేల్ అమెజాన్ ప్రైమ్ టైం కోసం ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమ వుతున్నారు. ఇది శరవణ భవన్ హోటల్ అధినేత దివంగత రాజగోపాల్ జీవితంలో జరిగిన సంచలన సంఘటనల ఇతివృత్తంతో ఉంటుందని ఇప్పటికే ప్రచారంలో ఉంది. దీనికి దోసె కింగ్ అనే టైటిల్‌ను కూడా నిర్ధారించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment