Tiger Nageswara Rao Review: ‘టైగర్‌ నాగేశ్వరరావు’మూవీ రివ్యూ | Tiger Nageswara Rao Movie Review And Rating In Telugu | Ravi Teja | Nupur Sanon | Renu Desai - Sakshi
Sakshi News home page

Tiger Nageswara Rao Movie Review: ‘టైగర్‌ నాగేశ్వరరావు’మూవీ రివ్యూ

Published Fri, Oct 20 2023 1:07 PM | Last Updated on Sat, Oct 21 2023 7:12 AM

Tiger Nageswara Rao Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: టైగర్‌ నాగేశ్వరరావు
నటీనటులు: రవితేజ,నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు
నిర్మాణసంస్థ:అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌
దర్శకత్వం: వంశీ
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: ఆర్‌ మదీ
విడుదల తేది: అక్టోబర్‌ 20, 2023 
 

ప్రముఖ రాజకీయ నాయకులు లేదా క్రీడ, సినీ రంగాలకు చెందిన వారి బయోపిక్‌ని తెరకెక్కించడం సాధారణం. కానీ ఓ దొంగ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించడం ఇంతవరకు చూడలేదు. దర్శకుడు వంశీ ఆ పని చేశాడు. అదే ‘టైగర్‌ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా పాన్‌ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా చేయడంతో ‘టైగర్‌ నాగేశ్వరరావు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
స్టువర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు అలియాస్‌ నాగి(రవితేజ) ఓ గజదొంగ. పోలీసులకు ముందుగా సమాచారం అందించి దొంగతనం చేయడం అతని స్పెషాలిటి. తన గ్యాంగ్‌తో కలిసి బ్యాంకు దోపిడీలకు పాల్పడతుంటాడు. స్థానిక ఎమ్మెల్యే ఎలమంద(హరీష్‌ పేరడి), అతని తమ్ముడు కాశీ స్టువర్టుపురం దొంగలపై పెత్తనం చెలాయిస్తుంటారు. ఆ ప్రాంతం ఏం దొంగతనం జరిగినా.. ఎలమందకు కమీషన్‌ వెళ్లాల్సిందే.  నాగి మాత్రం వారిని పట్టించుకోకుండా..తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఒకనొక దశలో ఏకంగా దేశ ప్రధానమంత్రి ఇంట్లో దోపిడికి ప్లాన్‌ చేస్తాడు. ఆ విషయాన్ని ముందే ప్రధాని భద్రతా సిబ్బంది తెలియజేస్తాడు.

అసలు టైగర్‌ నాగేశ్వరరావు ప్రధాని ఇంట్లో దొంగతనం చేయడానికి గల కారణం ఏంటి? ప్రధాని ఇంటి నుంచి ఏం దొంగతనం చేశాడు? ఆ దొంగతనం తర్వాత నాగి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఎనిమిదేళ్ల వయసులోనే నాగేశ్వరరావు దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దొంతగతం చేసి సంపాదించిన డబ్బంతా ఏం చేశాడు? నాగేశ్వరరావు కాస్త టైగర్‌ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? సీఐ మౌళి(జిషు సేన్‌ గుప్తా)తో నాగికి ఉన్న వైర్యం ఏంటి? ఎమ్మెల్యే ఎలమంద, అతని తమ్ముడు కాశీ చేసే అరచకాలను నాగి ఎలా తిప్పికొట్టాడు. ప్రేమించిన అమ్మాయి సారా(నూపుర్‌ సనన్‌)ఎలా చనిపోయింది? నాగి జీవితంపై సంఘ సంస్కర్త హేమలతా లవణం ప్రభావం ఎలా ఉంది? చివరకు నాగేశ్వరరావు ఎలా చనిపోయాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
‘కొన్ని చరిత్రలు నెత్తుటి సిరాతో రాస్తారు..మరికొన్ని చరిత్రలు కన్నీటి సిరాతో రాస్తారు.. నెత్తురు, కన్నీటి సిరాతో రాసిన చరిత్రే ‘టైగర్‌ నాగేశ్వరరావు’’అని సినిమా ప్రారంభానికి ముందు ఓ కార్డు వేశారు. సినిమా మొత్తం చూశాక మనకు అదే ఫిలింగ్‌ కలుగుతుంది. టైగర్‌ నాగేశ్వరరావు ఓ దొంగ అని.. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి దొంగతనం చేసేవాడు అని కొంతమంది తెలుసు. అసలు అతను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చింది? దోచిన డబ్బంతా ఏం చేశాడు? ఎలా చనిపోయాడు అనేది చాలా మందికి తెలియదు. ఈ చిత్రంలో అదే చూపించారు. 

వాస్తవానికి ఇది బయోపిక్‌ అయినా.. చాలా చోట్ల సినిమాటిక్‌ లిబర్టీనీ తీసుకున్నాడు దర్శకుడు. అలాగే అందరిలాగే నాగేశ్వరరావులో కూడా చెడు, మంచి రెండూ ఉన్నాయి. కానీ దర్శకుడు వంశి మాత్రం రెండో కోణాన్నే తెరపై చూపించాడు. టైగర్ చేసే ప్రతీ దొంగతనం వెనుక ఓ మంచి కారణం ఉందనేది చూపించాడు.

ఇది ఓ గజదొంగ బయోపిక్‌ కాబట్టి దొంగతనాలు తప్పా ఇంకేం చూసిస్తాడులే అనుకోవచ్చు. కానీ స్టువర్టుపురం ప్రజలు ఎందుకు దొంగలుగా మారాల్సి వచ్చింది? రాజకీయ నాయకులు,పోలీసులు అధికారుల చేతుల్లో వారి జీవితాలు ఎలా నలిగిపోయాయి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించారు.

ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌(అనుపమ్ ఖేర్)కు స్టువర్టుపురం ఏరియాలో పని చేసిన పోలీసు అధికారి విశ్వనాథ్‌ శాస్త్రీ(మురళీ శర్మ).. టైగర్‌ నాగేశ్వరరావు గురించి  చెప్పే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది.  రాజ‌మండ్రి బ్రిడ్జ్పై ట్రైన్ దోపిడీ సీన్‌తో హీరో ఎంట్రీ ఉంటుంది.  ఆ దొంగతనం సీన్‌ అయితే అదిరిపోతుంది. ఆ తర్వాత టైగర్‌ నాగేశ్వరావు బాల్యం, స్టువర్ట్‌పురం దొంగల గురించి తెలుపుతూ సన్నివేశాలు అల్లారు.  సారాతో ప్రేమాయణం ఎపిసోడ్‌  అంతగా ఆకట్టుకోదు కానీ ఆమె చనిపోయే సన్నివేశం అయితే ఎమోషనల్‌గా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌ అదిరిపోతుంది. 

హీరో జైలు నుంచి తప్పించుకొని వచ్చిన తర్వాత వచ్చే యాక్షన్‌ సీన్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి.  సెకండాఫ్‌లో టైగర్‌ మరదలు మణితో వచ్చే సీన్స్‌ కూడా సాగదీతగా అనిపిస్తాయి.  హేమలత లవణం ఎంట్రీ తర్వాత కథ ఫాస్ట్‌గా ముందుకు సాగుతుంది.  క్లైమాక్స్‌కి ముందు రివీల్‌ చేసే కొన్ని ట్విస్టులు టైగర్‌పై మరింత ప్రేమను కలిగించేలా చేస్తాయి. ఈ విషయంలో స్క్రీన్‌ప్లేతో మాయ చేశాడు దర్శకుడు.   కొన్ని సీన్లు పుష్ప సినిమాను గుర్తు చేస్తాయి.  సినిమా నిడివి కూడా కొంచెం ఇబ్బందికి గురి చేస్తుంది.

ఎవరెలా చేశారంటే...
టైగర్‌ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఒదిగిపోయాడు.యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు. తెరపై కొత్త రవితేజను చూస్తాం. అయితే అతన్ని యంగ్‌గా చూపించేందుకు వాడిన గ్రాఫిక్స్‌ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.  టైగర్‌ ప్రేమించిన అమ్మాయి సారా పాత్రకి నూపుర్ సనన్, మరదలు మణి పాత్రకి గాయత్రి భరద్వాజ్ న్యాయం చేశారు.

తెరపై వీరిద్దరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక ఎమ్మెల్యే ఎలమంద పాత్రలో హరీష్‌ పేరడ ఒదిగిపోయాడు. ఒక సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రకి రేణూ దేశాయ్‌ న్యాయం చేసింది. ఆమె పాత్ర సెకండాఫ్‌లో వస్తుంది. నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోయే పాత్రలో నటించింది. 

స్టువర్ట్‌పురం గ్రామ వాసి, దొంగలకు కోచింగ్‌ ఇచ్చే వ్యక్తి గజ్జల ప్రసాద్‌గా నాజర్‌ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. ఐబీ ఆఫీసర్ రాఘవేంద్ర రాజ్‌పుత్‌, సీఐ మౌళిగా జిషు సేన్‌ గుప్తాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. అయితే పాటలు మాత్రం సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement