బాహుబలి తర్వాత టాలీవుడ్ స్థాయి అమాంతం పెరిగింది. మన సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఆల్ ఇండియా బాక్సాఫీస్‌ని కొల్లగొడుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి.. కానీ ఇప్పుడు మన సినిమాలే అక్కడ రీమేకై.. భారీ వసూళ్లని రాబడుతున్నాయి. మన దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో టాలీవుడ్ సినిమాల స్థాయి అమాంతం పెరిగిపోయింది. స్థాయి పెరగడంతో హీరోల రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో ప్రభాస్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్ ముగ్గురూ టాప్ రెమ్యునరేషన్ లెవల్‌లో ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఆయన సినిమాలన్ని పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.80 కోట్లకు పైగా పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారట. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌కి రూ.65కోట్లకు పైగా అందుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. రాబోయే సినిమాలకు కూడా అంతే మొత్తంలో తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. వీటితో పాటు లాభాల్లోనూ వాటాలు తీసుకుంటారట.
గతంలో పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకున్న మహేశ్ బాబు.. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు మాత్రం 50 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్టు భోగట్టా. ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే .. అరవింద సమేత సినిమా టైమ్‌లో ఆయన రెమ్యునరేషన్ పాతిక కోట్లకు కాస్త అటు ఇటుగానే ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ కు మాత్రం దాదాపు 40 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత ఎన్టీఆర్ రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం రూ.40 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసినవి రెండూ స్వంత సినిమాలే. ఆచార్య సినిమాకు దాదాపు 40 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా విడుదల తరువాత ఆ ఫిగర్ అటు ఇటు మారుతుందేమో చూడాలి.
ఇప్పటి వరకు రూ 35 కోట్ల వరకు తీసుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 కోసం తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు. పుష్ప పార్ట్ 2 కు బన్నీ రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
అలాగే సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ మొన్నటి వరకు అయిదారు కోట్ల రేంజ్ లోనే వున్నారు. ఇప్పుడు వాళ్లు కూడా తమ రేటును పెంచేశారు. బాలయ్య ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల వరకు తీసుకుంటుండగా, నాగార్జున 7 కోట్లు, వెంకటేశ్8 కోట్లకు పైగా పారితోషికంగా అందుకుటున్నారట. వీరితో పాటు యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, నాని ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయిదారు కోట్ల రేంజ్ లో శర్వానంద్, నితిన్, గోపీచంద్ ఉన్నారు.
(నోట్: ఒక్కో సినిమాకు హీరోలు ఎంత తీసుకుంటారనేది అఫిషియల్‌గా ఎక్కడ ప్రకటించరు. కానీ సినిమా స్థాయి, బడ్జెట్, పాత్ర పరిధిని బట్టి హీరోలు ఈ మాత్రమైనా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా)
Comments
Please login to add a commentAdd a comment