
తెలుగు, తమిళం భాషలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి త్రిష. ఒక దశలో లేడీ ఓరియంటెడ్ స్థాయికి ఎదిగిన ఈ బ్యూటీ ఆ తరహా చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో కెరీర్ డౌన్ ఫాల్ అయ్యింది. అలా వరుస అపజయాలతో సతమతమవుతున్న త్రిష పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో లైమ్ లైట్‌లోకి వచ్చారు. దీంతో కొత్తగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. తాజాగా విజయ్ సరసన కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇది విజయ్‌కి 67వ చిత్రం.
మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. అదే విధంగా మాస్టర్ వంటి హిట్ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం. జనవరి 2వ తేదీ నుంచి చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విజయ్ డాన్‌గా నటించనున్నట్లు, ఏడు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందులో ఒక పాత్రను యాక్షన్ కింగ్ అర్జున్ నటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. దీనికి అనిరుద్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస చాయాగ్రహణంను అందిస్తున్నారు. కాగా ఇందులో త్రిష కథానాయకగా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా చిత్రం షూటింగ్ తదుపరి కాశ్మీర్‌లో జరగనున్నట్లు, ఇందులో పాల్గొనడానికి త్రిష మంగళవారం ఉదయం కాశ్మీర్‌కు బయలుదేరినట్లు సమాచారం. చెన్నై విమానాశ్రయం నుంచి ఈమె వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.