విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న చిత్రం లియో. కారణం విజయ్ హీరోగా నటించడమే? అనే చర్చ జరిగింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అయితే కారణాలేమైనా చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ చిత్రం లియో. త్రిష, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్ తదతర భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
కాగా ఈ చిత్రం వారంలోనే రూ.461 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో లియో చిత్ర విజయోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీస్ బందోబస్తు కోరుతూ నిర్మాత ఆ శాఖాధికారులకు లేఖ రాశారు.ఆ లేఖపై పోలీస్ అధికారులు పలు ప్రశ్నలు స్పందిస్తూ నిర్మాతకు తిరిగి లేఖ పంపారు.
ముఖ్యంగా లియో చిత్రం విజయోత్సవానికి వచ్చే సినీ ప్రముఖులు ఎందరు?, అభిమానులు ఎందరు? కార్యక్రమాన్ని ఎన్ని గంటల ప్రారంభించి, ఎన్ని గంటలకు ముగిస్తారు? నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎన్ని కుర్చీలు ఉంటాయి? స్టేడియం నిర్వాహకులు అనుమతి పొందారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను చర్చించిన తరువాతే పోలీస్ బందోబస్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లియో చిత్రం విజయోత్సవ వేడుక జరుగుతుందా? అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment