
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తాజాగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. హనుమాన్‌లో హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా హనుమాన్ భారీ విగ్రహాన్ని చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అందులోని విజువల్స్ అన్నీ అబ్బురపరిచేలా ఉన్నాయి. హనుమాన్ అద్భుతాల వెనుక గ్రాఫిక్స్ మాంత్రికుడు ఉదయ్ కృష్ణ శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ ఎఫెక్ట్స్ రంగంతో రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్న ఆయన హనుమాన్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పనిచేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.
భారత చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే "హనుమాన్" చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉదయ్ చెబుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వినియోగించుకోవడంలో విజనరీగా పేరొందిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సరసన సగర్వంగా నిలిచేంత సత్తా ప్రశాంత్ వర్మలో ఉందని ఆయన పేర్కొన్నారు.
తేజ సజ్జా టైటిల్ పాత్రలో ప్రైమ్ షో ఎంటర్త్సైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన "హనుమాన్" జనవరి 12న విడుదలై విజయ దుందుభి మ్రోగిస్తోంది. సినిమా విడుదలకు ముందే టీజర్ విజువల్స్ చూసిన ప్రేక్షకుల్లో హనుమాన్ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ప్రశాంత్ వర్మ స్వయంగా సమకూర్చిన కథ - కథనాలకు ఉదయ్ కృష్ణ సారధ్యంలో అద్దిన గ్రాఫిక్స్ జత కలవడంతో "హనుమాన్" చిత్రం అత్యద్భుతంగా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇప్పటికే విడుదల చేయగా... మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ లాంగ్వేజిస్‌లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రెండేళ్లుగా తన జీవితంలో అంతర్భాగంగా మారిపోయిన "హనుమాన్" సాధిస్తున్న సంచలన విజయం... ఈ చిత్రం కోసం తాను పడిన కష్టమంతా మరిచిపోయేలా చేస్తోందని ఉదయ్ అంటున్నారు. ప్రతికూలతలు, పరిమిత వనరుల నడుమ ప్రతిభను చాటడంలో పేరెన్నికగన్న ఉదయ్ ప్రస్తుతం "బీస్ట్ బెల్స్" పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను హైదరాబాద్‌లోనే నెలకొలిపే సన్నాహాల్లో ఉన్నారు. సినిమా ముగింపులో భూమ్యాకాశాలకు విస్తరించే హనుమాన్‌కు ఆయన జీవం పోయడం ఈ చిత్రం కోసం తాను ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజస్‌లలో ముఖ్యమైనదని చెబుతున్న ఉదయ్... మన తెలుగు దర్శకులు కలలుగనే ఎంత గొప్ప విజువల్ అయినా... సునాయాసంగా సాకారం చేసే సామర్ధ్యం తనుకుందని సవినయంగా చెబుతున్నారు.