‘‘సత్యం’ థియేటర్‌లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్‌లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్‌రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్‌కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.
‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, భారీ వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్‌లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment