
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో కొత్త ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్‌ని విజయవంతంగా ముగించుకున్న ‘అన్ స్టాపబుల్-2’ మూడో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజయ్యారు. బాలయ్య పంచులు.. శర్వా, శేష్‌లు జోకులతో ప్రోమో నవ్వులు పూయిస్తోంది. శర్వా వచ్చి రావడంతోనే బాలయ్యను పొగడ్తలతో ముంచేశాడు. ‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికే బాలుడే’అంటూ బాలకృష్ణను ఇంప్రెస్ చేశాడు. అలాగే తనకు క్రష్ అని చెప్పిన రష్మికతో వీడియో కాల్ మాట్లాడించాడు.
ఇక షోకి వచ్చిన అడవి శేష్‌ని పెళ్లి ఎప్పుడు? అని బాలకృష్ణ ప్రశ్నించగా..ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని చాలా ప్రెజర్.. నాకేమో ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోలేని పెద్దలు చాలా మంది ఉన్నారు. ప్రభాస్, శర్వానంద్ లాంటి వాళ్లు ఇంకా పెళ్లి చేసుకోలేదని చెబుతూ తప్పించుకుంటున్నాను అన్నారు. అప్పుడు శర్వా.. ‘నేను ఆయన(ప్రభాస్) పేరు చెప్పుకొని తిరుగుతున్నా.. నువ్వేమో నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావా? అని అనడంతో బాలకృష్ణతో సహా అందరూ గట్టిగా నవ్వారు.
షోలో భాగంగా చివర్లో చిన్న గేమ్ ఆడదాం బ్రదర్స్ అంటూ.. ట్రూత్ అయితే దుస్తులు విప్పేయాలని కండీషన్ పెట్టాడు. మొదటి ప్రశ్నగా ‘సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో? ’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పేందుకు ఇద్దరు హీరోలు భయపడ్డారు. ఆ హీరో బాలయ్యనే అని చెప్పే సాహసం చేయలేకపోయారు. చివరకు శర్వా.. మీ ఆన్సర్ అయినా కూడా మేమే విప్పాలా సర్? అని ప్రశ్నించగా.. ‘స్టూడియో దాటి బయటికి వెళ్లగలరా?’అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా ఈ యంగ్ హీరోలతో బాలయ్య ఎలా ఆడుకున్నారో శుక్రవారం(నవంబర్ 4) ప్రసారం అయ్యే ఫుల్ ఎపిసోడ్‌లో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment