
దక్షిణాది చిత్ర పరిశ్రమలోని సంచలన నటిమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. నటిగానూ, వ్యక్తిగతంగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన నటి ఈమె. ఈమె కోలివుడ్‌లో శింబుకు జంటగా 'పోడాపొడి' చిత్రం ద్వారా కథానాయకగా పరిచయం అయ్యారు. అయితే నిజానికి ఈమె శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రం ద్వారానే నాయకిగా పరిచయం కావలసి ఉందట. నటనపై ఆసక్తితో ముంబాయిలో అనుపమ్ ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వరలక్ష్మి శరత్ కుమార్‌ను చదువు పూర్తి అయిన తరువాత నటించాలని ఆమె తండ్రి శరత్ కుమార్ చెప్పడంతో బాయ్స్ చిత్ర అవకాశాన్ని వదులుకున్నారట.
ఇదే విధంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో సరోజా చిత్రంలోనూ నటించలేకపోయారట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల స్పష్టం చేశారు. ఆ తర్వాత నటుడు శింబు సరసన పోడా పోడి చిత్రంలో నటించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటి వరలక్ష్మి కెరీర్‌కు మాత్రం మంచి పునాది వేసింది. ఆ తర్వాత తారై తప్పట్టై చిత్రంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతే ఆమెకు ఇక నటిగా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కలగలేదు.
(ఇదీ చదవండి: లిప్‌లాక్,బోల్డ్ సీన్స్‌పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్)
కథానాయకగా, ప్రతినాయకగా తమిళం, తెలుగు తదితర చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ అర్ధసెంచరీ మైలు రాయిని అధిగమించేశారు. దీని గురించి ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాబై చిత్రాలు పూర్తి చేయడానికి అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ముఖ్యంగా తన టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్ అనీ, తాను ఇంతకాలం నటిగా కొనసాగుతానని గానీ, ఇన్ని చిత్రాల్లో నటిస్తానని అనుకోలేదన్నారు. ఇకపై నటనను ఆపే ప్రసక్తే లేదని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొన్నారు.