వివేకానందగారి బయోపిక్‌కి స్క్రిప్ట్ కుదరడం లేదు. నేను, నాని ఓ సినిమా చేయబోతున్నామా అంటే.. నానీతోనే కాదు.. నేను అందరితో కలిసి సినిమాలు చేయాలనుకుంటున్నాను. నా తర్వాతి సినిమా కోసం మూడు కథలు విన్నాను. తర్వలో చెబుతాను.
‘‘నా 75వ సినిమా కాబట్టి ‘సైంధవ్’ నాకు స్పెషల్ ఫిల్మ్ అనేం కాదు. నా ప్రతి సినిమా నాకు స్పెషలే. నిర్మాతలు సినిమాకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓ నటుడిగా నేను పారితోషికం తీసుకుంటున్నాను. సో.. నటుడిగా నేను వంద శాతం నిజాయితీగా కష్టపడాలి. ప్రతి సినిమాకు ఇదే చేస్తున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు.
వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. వెంకటేశ్ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రంలో ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, చైల్డ్ ఆర్టిస్టు సారా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం రేపు (శనివారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకటేశ్ చెప్పిన విశేషాలు.
► నా కెరీర్‌లో నేను చేసిన చాలా సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు ఆడాయి.. కొన్ని నిరాశపరచాయి. ఈ సంక్రాంతికి ‘సైంధవ్’ వస్తోంది. ఓ మంచి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ పండగకి ‘సైంధవ్’తో పాటు వస్తున్న మిగతా సినిమాలు ‘నా సామిరంగ’, ‘గుంటూరు కారం’, ‘హను–మాన్’ కూడా విజయం సాధించాలి. సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. అయినా ఓ వారం పోతే సంక్రాంతి సినిమాల గురించి ఎవరూ మాట్లాడుకోరు.
► ‘సైంధవ్’ కథను శైలేష్ చెప్పినప్పుడు బాగుందనిపించింది. ఓ యాక్టర్‌గా నా పని నేను చేశాను. దర్శకుడిగా తన పని తాను చేశాడు. చైల్డ్ ఆర్టిస్టులతో కలిసి నటించడం నాకు సరదాగా ఉంటుంది. ‘కలిసుందాం..రా’, ‘తులసి’ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులతో కలిసి చేశాను. ‘సైంధవ్’లో సారాతో చేశాను. సారా బాగా నటించింది. నవాజుద్దీన్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్. ‘సైంధవ్’లో కథ ముందుకు కదులుతూనే ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంటుంది.
► ప్రత్యేకంగా యాక్షన్ సినిమాలు చేయాలని చేయడం లేదు. ‘బొబ్బిలిరాజా’ సినిమా సమయంలో కొన్ని గాయాలయ్యాయి. ఆ సమయంలో కొన్ని ఫ్యామిలీ సినిమాలు చేశాను. ప్రేక్షకులు ఆదరించారు. అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలూ చేశాను. ఇప్పుడు ‘సైంధవ్’ చేశాను. ఇదంతా జర్నీలో ఓ భాగం. స్పిరిట్చ్యువల్‌గా చెప్పాలంటే.. మనకి జీవితంలో కొంత అదృష్టం కూడా ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్, సినిమాలు వాటంతట అవే కుదురుతాయి. కొన్నిసార్లు ఓ సినిమా ప్రయాణంలో అది అంతగా ఆడదేమో అనిపిస్తుంది. మంచి సబ్జెక్ట్ లేకపోతే యాక్టర్స్‌గా మేం ఏమీ చేయలేం. కథ కుదరకపోతే పెద్ద కాంబినేషన్స్‌తో కూడిన సినిమాలు కూడా నష్టపోయిన రోజులు ఉన్నాయి.
► 75వ సినిమా, 100వ సినిమా అనేవి నా దృష్టిలో నంబర్స్ మాత్రమే. అలాగే రికార్డ్స్, కలెక్షన్స్ వంటి అంశాల జోలికి వెళ్లను. నా కెరీర్ ఆరంభంలో 98 రోజులు ఆడిన సినిమాలను సడన్‌గా ఆపేసిన ఘటనలు ఉన్నాయి. నేను అంతగా ఏం ఫీల్ కాలేదు. అది నిర్మాతలు, పంపిణీదారుల నిర్ణయం కదా అని అనుకునేవాడిని. ఈ విషయంలో నా అభిమానులు మొదట్లో కాస్త అసహనంగా ఉండేవారు. కానీ నా స్టైల్‌ను వారు అర్థం చేసుకున్నారు. అందుకు వారికి థ్యాంక్స్
► నేను డిఫరెంట్‌గా చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఇంపాక్ట్ నా సినిమాలపై ఉండదనే అనుకుంటున్నాను. అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. యాక్టర్‌గా మనం నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. నెగటివ్ ఫీడ్‌బ్యాక్ ఉండొచ్చు. కానీ నేను తీసుకోను. పాజిటివ్‌గానే ఉంటాను. అప్పుడే మన జీవితంలో మనం సంతోషంగా ఉండగలం. అలాగే నటుడిగా నా సుధీర్ఘమైన కెరీర్‌లో ఎందుకు వివాదాలు లేవో నాకే తెలియదు. నాకు తెలిస్తే అందరికీ చెబుతాను (నవ్వుతూ). అయితే నా స్కూల్, కాలేజీ, ఇప్పుడు ఇండస్ట్రీ... ఇలా ఎప్పుడైనా నా తోటి వారు నావల్ల అసౌకర్యంగా ఫీల్ కాకూడదని భావిస్తుంటాను.
Comments
Please login to add a commentAdd a comment