‘‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో సీఐ మురళి పాత్ర చేశాను. ఇలాంటి జోనర్ సినిమా నేను చేయలేదు. పైగా వైడ్ రీచ్ ఉన్న సినిమా. ఇలాంటి సినిమా చేస్తే నేను మళ్లీ నటిస్తున్నాననే విషయం ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే అభిప్రాయంతోనే ఈ సినిమా చేశాను’’ అని నటుడు వేణు తొట్టెంపూడి అన్నారు. రవితేజ హీరోగా దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి పంచుకున్న విశేషాలు.
► ‘దమ్ము’ చిత్రం తర్వాత నేను సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మాకున్న వ్యాపారాల్లో బిజీ అయిపోవడంతో సినిమాల గురించి ఆలోచించే తీరిక లేదు. కొంతమంది సినిమా కోసం సంప్రదించినా సున్నితంగా తిరస్కరించేవాణ్ణి. అయితే కరోనా టైమ్‌లో ఇంట్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నప్పుడు మళ్లీ సినిమాపై ఆసక్తి కలిగింది. ఆ సమయంలో శరత్ మండవ చెప్పిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథ నచ్చడంతో ఓకే చెప్పేశాను.
► ‘స్వయంవరం’ సినిమాలో రవితేజగారు నాతో కలిసి పని చేయాల్సి ఉన్న విషయం గురించి నిజంగా నాకు తెలీదు. అప్పుడు కుదరకపోయినా ‘రామారావు ఆన్ డ్యూటీ’తో మా కాంబినేషన్ కుదిరింది. మొదటి నుంచి కూడా నేను మల్టీస్టారర్ సినిమాలకి ఆసక్తి చూపేవాణ్ణి. ‘చిరునవ్వుతో’ వంటి హిట్ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ సినిమా చేశాను. చాలామంది నటీనటులతో కలసి నటించడం ఓ పండగలా ఉంటుంది.
► నేను హిట్ సినిమాలు చేసినప్పటికీ నా పాత్రకు డబ్బింగ్ చెప్పలేదనే చిన్న అసంతృప్తి ఉండేది. కానీ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో నేనే డబ్బింగ్ చెప్పడం తృప్తిని ఇచ్చింది. ఇకపై నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెబుతాను. రవితేజగారి లాంటి మాస్ స్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీ. ఇలాంటి మంచి చిత్రంతో నాకు ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చిన రవితేజ, సుధాకర్, శరత్ మండవలకు థ్యాంక్స్.
► నా సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా చేశారు. తను దర్శకుడు అయ్యాక ‘అతడు’లో సోనూ సూద్ చేసిన పాత్ర మొదట నాకే చెప్పారు. నేను చేయకపోవడంతో సోనూ సూద్ చేశారు. నాకు సరిపడే పాత్ర ఉంటే త్రివిక్రమ్ తప్పకుండా నాకు చెబుతారు. నా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏం లేదు.. మంచి ఆహారం తింటాను. సాధ్యమైనంత వరకూ బయట ఫుడ్‌కు దూరంగా ఉంటాను. శరీరాన్ని పాడుచేసే ఏ చెడ్డ అలవాటు లేదు. మిగతాది తల్లితండ్రుల ఆశీర్వాదం.
►ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. అలాగే వెబ్ కంటెంట్‌పై కూడా దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఛాయ్ బిస్కెట్ నిర్మా ణంలో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్ కూడా చర్చల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment