లంబాడిపల్లిలో గంగవ్వ, గంగవ్వ ఇల్లు
సాక్షి, మల్యాల(చొప్పదండి): బిగ్‌బాస్ షోలో కనబడితే చాలు అనుకునే వేలాది మందికి రాని అవకాశం గంగవ్వ తలుపు తట్టింది. చాంపియన్ కావాలనే సంకల్పంతో అడుగుపెట్టే వారికి భిన్నంగా తన ఇంటి కల నెరవేరితే చాలు అనుకుంటూ ఆ షోలో అడుగుపెట్టింది. రూ.లక్షలు కావాలనే కోరిక లేదు.. ఇల్లు కట్టుకుంటే చాలు అనే కల తప్ప.. ఆ మాటే చెప్పింది బిగ్‌బాస్ షోలో.. గంగవ్వ ఇంటి కల నెరవేరుస్తా అని బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మాట ఇవ్వడంతో తాను అనుకున్నది సాధించినంత సంబరపడింది. రియాల్టీ షో.. నటన అంటే తెలియదు.. తెలిసిందల్లా తనకు తోచింది చేసుడే.. నిర్మలమైన హృదయం.. కల్మషం లేని మనసు.. అందరూ మంచిగ ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం.. అక్షరం నేర్వకపోయినా కష్టాలు, కన్నీళ్లు జీవిత పాఠాలు నేర్పాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు అందరూ గంగవ్వ కోసం బిగ్‌బాస్ చూశారనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల నుంచి తెలుగువారు లక్షలాది మంది ఆమెకు అభిమానులయ్యారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి స్వచ్ఛందంగా బయటకు వచ్చిన యూ ట్యూబ్ స్టార్ గంగవ్వకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆమె షోను వీడుతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మల్యాల మండలంలోని లంబాడిపల్లికి చెందిన గంగవ్వ బిగ్‌బాస్ షోలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన..
అవ్వగారి ఊరు పొలాస నుంచి అత్తగారి ఊరు లంబాడిపల్లికి అచ్చిన అంటే ఇంకో ఊరుకు పోలే. ఎప్పుడూ పొలం, ఇల్లు, చెట్టు, పుట్ట తప్ప ఏం తెల్వదు. మై విలేజ్ షో శ్రీరాం శ్రీకాంత్ తీసిన 200 సినిమాల్ల చేసిన. నేను పలుకబలుపం పట్టుకోని బడికిపోలే. సదువురాదు. శ్రీకాంత్ చెప్పింది చేసుడే వచ్చు. బిగ్‌బాసోళ్లు అడుగుతుండ్రు బిగ్‌బాస్‌కు పోతవా గంగవ్వ అని శ్రీకాంత్ అడిగిండు. మూడు నెలలు ఉంటవా మరి అని అంటే ఉంటా.. ఇల్లు కట్టుకునేందుకు ఉంట అని చెప్పిన. ఇగ ఏం ఆలోచించలేదు. బిగ్‌బాస్ పోత. ఇల్లు కట్టుకునేందుకు ఎన్ని రోజులైన ఉంటా అన్న. బిగ్‌బాస్‌కు పోవాల్నా అని నా బిడ్డలను అడిగిన.. పో అవ్వ అన్నరు. పోతే పైసలత్తే బిడ్డలకు కూడా ఇయ్యచ్చని అనుకొని పోయిన.
కారంటైన్ చెయ్యంగ మైండ్ కరాబైంది..
ఇక్కడి నుంచి పెయినంక.. కారంటైన్ అని ఒకటే రూంల 18 రోజులు ఉంచిన్రు. గప్పుడే మైండ్ అంత కరాబైంది. ఇంక బిగ్‌బాస్‌ల ఎంట్ల ఉంటదో అనిపించింది. కండ్లకు బట్టకట్టి బిగ్‌బాస్ షోకు తీసుకపోయిండ్రు. అక్కడికి పోయిన రోజే చెప్పిన నాకు ఇల్లు లేదు సారు.. మీరిచ్చే పైసలతోని ఇల్లు కట్టుకుందామని ఆశతో వచ్చిన అన్న. రెండు వారాలకే ఇంటి మొకాన పానం కొట్టుకునుడు మొదలైంది. కొడుకు, బిడ్డలు, మనవలు, మనవరాండ్లు ఎట్ల ఉన్నరో అని మనాది వడ్డది. ఇగ ఇంటిమీద రందితో జరం అచ్చింది. సూదులు ఇచ్చిండ్రు. మందులు ఇచ్చిండ్రు. మంచిగ సూసుకున్నరు.
ఎవలన్న తప్పు సేత్తె తిట్టెదాన్ని..
బిగ్‌బాస్ ఇంట్లకు పోయినాక అందరు నన్ను గంగవ్వ అనుకుంట మంచిగ సూసుకున్నరు. ఆట ఆడినప్పుడు ఒక్కలుగూడ నన్ను ఏం అనలేదు. ఎవలన్న తప్పు సేత్తె నేనే తిట్టెదాన్ని. అవ్వ.. అవ్వ అనుకుంట అందరూ నా సుట్టే తిరిగెటోళ్లు. అఖిల్ కాళ్లు ఒత్తుకుంట.. ఎట్ల ఉంది అవ్వ అనుకుంట నాతోనే ఉండెటోడు. బిగ్‌బాస్ ఇంట్ల నన్ను ఏం పని చెయ్యనియ్యలేదు. కానీ బిగ్‌బాస్ ఇంట్ల నుంచి ఎటూ పోరాదు. తెల్లందాక ఎప్పుడు ఏవో ఆటలు ఆడాలి. నిద్ర పోవుడు లేదు. బువ్వ తిందామంటే తినబుద్ది కాలేదు. ఓ టీవీ లేదు. గడియారం లేదు. చెట్టు కనవడది.. పుట్ట కనవడది.. ఎప్పుడు తెల్లారిందో.. ఎప్పుడు రాత్రయిందో తెల్వకపోతుండె. ఎట్లయినా ఇల్లు కట్టుకోవాలే అనే ఆలోచనతో అక్కడనే ఉండాలె అనుకున్న. కానీ ఎప్పుడు నలుగుట్ల తిరిగిన గదా అంత పెద్ద బంగుళాలో ఉండలేకపోయిన.
నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..
బిగ్‌బాస్ ఇంట్ల అందరు నాతోని మంచిగున్నరు. కానీ నాకు నా ఇంటి రంది వట్టుకొని రెండుసార్లు జరమచ్చింది. మొదటిసారి జరమచ్చినప్పుడు నా కొడుకును తీసుకచ్చి సూపెట్టినంక రెండు వారాలు ఉన్న. ఇగ వానలకు నా ఇల్లు ఏమైందో.. నా మనవలు, మనవరాండ్లు, బిడ్డలు ఎట్లున్నరో అని రందైంది. బిగ్‌బాస్ ఇల్లు పెద్దగ మంచిగుంది. నాకే ఏసీ వడలేదు. తిండి తినబుద్ది కాలే. నిద్ర పట్టలేదు. గందుకే బయటకు వచ్చిన. నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రని పిలగాండ్లు చెప్తున్నరు.
Comments
Please login to add a commentAdd a comment