ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

Published Fri, May 24 2024 8:15 AM

ట్రాఫ

ఏటూరునాగారం: మంగపేట, ఏటూరునాగారం మండలాల మధ్యగల కురుణాయిగూడెం వద్ద గురువారం ఓ 108 అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలో ఇసుక లారీల వల్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. దీంతో అబులెన్స్‌, అత్యవసర సర్వీసులకు సైతం ఇసుక లారీల డ్రైవర్లు దారి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ క్రమంలో గురువారం కరుణాయిగూడెం వద్ద రోగులను తీసుకెళ్తున్న అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకపోవడం బాధాకరం. పోలీసులు ఇసుక లారీలను నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాఽధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ

పరీక్షలకు ఏర్పాట్లు

ములుగు: నేటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో 8సెంటర్లు ఏర్పాటు చేసినట్లు నోడల్‌ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 782 మంది, ద్వితీయ సంవత్సరంలో 255 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్న 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

ఇంటర్‌ విద్యార్థులకు

కౌన్సెలింగ్‌

ఏటూరునాగారం: స్పోర్ట్స్‌ కాలేజీలో ప్రవేశాల కోసం గురువారం ఇంటర్‌ విద్యార్థులకు మండల కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి రీజియన్‌ పరిధి అధికారులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కాగా 640 సీట్లకు గాను 240 విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరై సీట్లు పొందినట్లు ఆర్‌సీఓ రాజ్యలక్ష్మి తెలిపారు. మిగిలిన సీట్లకు నోటిఫికేషన్‌ ఇచ్చి రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.

రైతులు దళారులను నమ్మొద్దు

ములుగు/ములుగు రూరల్‌: రైతులు పండించిన ధాన్యమంతా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మిమోసపోవద్దని కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎండి చాంద్‌పాషా ఆధ్వర్యంలో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీ మేరకు రైతులు పండించిన ధాన్యానికి ప్రతీ క్వింటాకు రూ.500 బోనస్‌ ప్రకటించడంతో సీఎం రేవంత్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి బకాయి పడ్డ మిల్లర్లు రైతుల నుంచి నేరుగా వడ్లు కొనుగోలు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వంగ రవియాదవ్‌, జయపాల్‌రెడ్డి, కంబాల రవి, రవీందర్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, మావురపు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ఎండు గంజాయి పట్టివేత

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పట్టణంలోని కేటీకే 5వ గని మూలమాలుపు వద్ద గురువారం పోలీసులు ఎండు గంజాయిని పట్టుకున్నారు. సీఐ నరేష్‌కుమార్‌ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరంకు చెందిన నిగ్గుల రాజు ద్విచక్ర వాహనంపై 1.100 కేజీల ఎండు గంజాయిని భూపాలపల్లికి తీసుకువస్తున్నాడు. ఎస్సై సుధాకర్‌ ఆధ్వర్యంలో రాజు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. దీంతో అతడిని విచారించగా నడికూడ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు దగ్గర కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న  అంబులెన్స్‌
1/2

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

ట్రాఫిక్‌లో చిక్కుకున్న  అంబులెన్స్‌
2/2

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

Advertisement
 
Advertisement
 
Advertisement