ఒకే ఒక్క చిన్న పొరపాటు.. మొత్తం బ్యాంకు ఖాతా ఖాళీ | Be aware of Cyber crime, your account will be empty without your action | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్క చిన్న పొరపాటు.. మొత్తం బ్యాంకు ఖాతా ఖాళీ

Published Wed, May 3 2023 1:26 AM | Last Updated on Fri, May 5 2023 6:02 PM

- - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా ఇటీవల సైబర్‌ నేరాల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రెప్పపాటు కాలంలో మోసానికి గురిచేసే సైబర్‌ నేరాలపట్ల అవగాహన కొరవడటంతోనే బాధితులు ఎక్కువ సంఖ్యలో మోసపోతున్నారు. సైబర్‌ మోసానికి గురై రూ.లక్షల్లో డబ్బులు కోల్పోతున్న వారిలో ఉద్యోగులు, అక్షరాస్యులు సైతం ఉంటున్నారు. సైబర్‌ నేరాలకు గురైన వారిలో చాలామంది బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో చోటుచేసుకున్న సైబర్‌ నేరాల్లో అధికంగా సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లకు స్పందించడం, ఆన్‌లైన్‌ యాప్‌లకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి.

సైబర్‌ నేరస్తుల బారిన పడి మోసపోతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 2022లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సైబర్‌ నేరాలకు సంబంధించి మొత్తం 250 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లోనే మొత్తం 43 కేసులు నమోదయ్యాయి. అలాగే పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కని బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో సైబర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో 2022లో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. వీరిలో అధికంగా నాగర్‌కర్నూల్‌ మండలంలో 21 మంది, కల్వకుర్తిలో 11 మంది సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి పెద్దమొత్తంలో డబ్బులు కోల్పోయారు. ఈ ఏడాదిలో మొత్తం 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో అధికంగా 57 మంది సైబర్‌ నేరాలకు గురయ్యారు.

అవగాహన లేకపోవడం వల్లే..

సైబర్‌ నేరాల్లో అధికంగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెసేజ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. మెసేజ్‌లో వచ్చిన లింకుపై క్లిక్‌ చేయగానే క్షణాల్లో అకౌంట్లో డబ్బులు మాయమవుతున్నాయి. తర్వాత ఆన్‌లైన్‌ యాప్‌ల్లో పెట్టుబడి పెట్టాలంటూ, ఉద్యోగాలు ఇస్తామంటూ అమాయకులకు ఎరవేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీనిపై సంబంఽధిత క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోనే బాధితుల సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట లోని మహేంద్రనగర్‌ కాలనీకి చెందిన శ్రీకాంత్‌ ఫోన్‌కు గతనెల 20న అపరిచిత వ్యక్తుల నుంచి మెసేజ్‌ వచ్చింది. ఇంట్లో నుంచే పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ డబ్బులు సంపాదించొచ్చు అంటూ వచ్చిన లింక్‌పై నొక్కడంతో శ్రీకాంత్‌ అకౌంట్లో ఉన్న రూ.1.40 లక్షలు మాయమయ్యాయి. మోసపోయినట్టు గుర్తించిన బాధితుడు పోలీసులకుఫిర్యాదు చేశాడు.’

‘వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాసులు వాట్సప్‌కు గత నెల 22న వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. అపరిచితుల నుంచి వచ్చిన వాట్సప్‌ లింకుపై క్లిక్‌ చేయగానే, అకౌంట్లో ఉన్న రూ.94 వేలు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌ చూసి కంగుతిన్నాడు. జరిగిన మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.’

వెంటనే ఫిర్యాదు చేయాలి..

ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నా యి. అపరిచితుల నుంచి వచ్చే అనవసర మెసేజ్‌లకు స్పందించొద్దు. తక్కు వ మొత్తాలకు ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పే ఆన్‌లైన్‌ యాప్‌ జోలికి వెళ్లొద్దు. మోసపోయినట్టు గుర్తించినా వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉంటుంది.

– రామేశ్వర్‌, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్‌

నారాయణపేట జిల్లా మాగనూర్‌లో ఇటీవల భారీ ఆన్‌లైన్‌ మోసం వెలుగుచూసింది. తక్కువ మొత్తంలో పెట్టుబడితోనే ఎక్కువ లాభం వస్తుందంటూ చెప్పిన కేటుగాళ్ల మాయాలోపడి సుమారు 40 మంది వరకు బాధితులు మోసపోయినట్టు తెలిసింది. ‘సోలో పవర్‌ వరల్డ్‌’ అనే ఆన్‌లైన్‌ యాప్‌లో ఒకసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ.960 చొప్పున, మొత్తం 185 రోజుల వరకు రూ.1,78,800 వస్తాయంటూ యాప్‌ నిర్వాహకులు నమ్మబలికారు. కొన్నిరోజుల పాటు అకౌంట్లలో డబ్బులు పడ్డ తర్వాత గత వారం రోజులుగా యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. ఒకరికి తెలిసిన వారు ఒకరు ఇలా ఒకే గ్రామానికి చెందిన బాధితులు మొత్తం సుమారు రూ.8లక్షల వరకు కోల్పోయినట్టు తెలిసింది. అయితే ఇంత జరిగినా దీనిపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఇలాంటి సమయాల్లో బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement