
నాగర్‌కర్నూల్ క్రైం: రెండేళ్లకు ముందు ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంతో పాటు అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రస్తుతం మళ్లీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పలు రకాల వేరియంట్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్‌తో చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు కరోనా కొత్త వేరియంట్ జేఎన్–1 భారిన పడకుండా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజల్లో భయాందోళన..
జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో చాలా రోజులుగా కరోనాకు సంబంధించి ఎక్కడా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు రోజు, రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడి మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని, చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఒక్క కేసు నమోదు కానప్పటికీ ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వచ్చే ప్రజలతో అప్రమత్తంగా ఉండాలని, దగ్గు, జలుబు, జ్వరంతో పాటు కరోనా లక్షణాలు ఉంటే సమాచారం అందించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో బస్సుల్లో రద్దీ పెరిగిపోవడంతో పాటు న్యూఇయర్ వేడుకల పేరిట యువత చేయనున్న హంగామా, జాతరల్లో రద్దీతో కరోనా కేసులు పెరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు 34 వేల కేసులు
జిల్లాలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి 34 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు జనరల్ ఆస్పత్రిలో 3 వెంటిలెటర్లు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని 28 పీహెచ్‌సీ, 6 సీహెచ్‌సీల పరిధిలో 50 మంది వైద్యులు, 70 మంది నర్సులు, 291 మంది ఏఎన్‌ఎంలు, 889 మంది ఆశా కార్యకర్తలను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment