
విద్యారంగం అభివృద్ధికే తొలి ప్రాధాన్యత
కందనూలు: విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, సొంత గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని నెలికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్‌వెల్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఫేర్‌వెల్ వేడుకలు విద్యార్థుల మధ్య అనుబంధాన్ని పెంపొందించే విధంగా నిలుస్తాయన్నారు. చదువులో మేలు చేయాలన్న విద్యార్థుల ప్రయత్నాలకు తనవంతు సహాయ, సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ విద్యపైనే ఆధారపడి ఉంటుందని, విద్యతోనే మంచి జీవితం సృష్టించుకోవచ్చని పేర్కొన్నారు. గురువులు చెప్పే మాటలను ప్రామాణికంగా తీసుకుని ఆచరించాలని విద్యార్థులకు సూచించారు. వివిధ స్థాయిలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ ఎమ్మెల్సీ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు మదన్‌మోహన్, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన శనేశ్వరుడి వార్షికోత్సవం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో శనేశ్వరస్వామి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకుడు విశ్వనాథశాస్త్రి అర్చక బృందం ఉమామహేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం వడ్డెమాన్ గ్రామస్తులు ఎద్దుల బండ్లతో ఆలయ పరిసరాల్లో శోకటోత్సవం నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు అన్నదానం ఏర్పాటు చేశారు.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్‌లో శనివారం ఎంఎస్‌ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.ఎస్‌ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు.

విద్యారంగం అభివృద్ధికే తొలి ప్రాధాన్యత