సాక్షి, యాదాద్రి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, వారం రోజుల్లోగా పార్టీ అధిష్టానానికి సంజాయిషీ ఇవ్వాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బీజేపీలో చేరిన ఒకటిన్నర సంవత్సరంలోనే బాలకృష్ణారెడ్డి ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుని హోదాలో జిట్టా బాలకృష్ణారెడ్డి తన పార్టీని 2022 ఫిబ్రవరి 16న బీజేపీలో విలీనం చేశారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ద్వారా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఢిల్లీలో ఆయన బీజేపీ గూటికి చేరారు. అయితే కొంత కాలంగా బీజేపీకి జిట్టా దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా..
జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచే యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జిట్టా బాలకష్ణారెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. భువనగిరి కోటను విద్యుత్ దీపాలతో అలంకరించి, తెలంగాణ సంప్రదాయంలో వంటకాలు చేయించి పెద్ద ఎత్తున హోలీ పండుగ నిర్వహించి అప్పట్లో సంచలనం సృష్టించారు.
అయితే, 2009లో టీఆర్‌ఎస్ పార్టీ మహా కూటమిలో చేరింది. ఆ ఎన్నికల్లో భువనగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిమినేటి ఉమామాధవరెడ్డి టీడీపీ నుంచి మహా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తనకు టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. ఆయన మరోసారి 2014లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
2018లో బీజేపీ బలపర్చిన అభ్యర్థిగా యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో బీజేపీలో తన యువ తెలంగాణ పార్టీని విలీనం చేయడం ద్వారా భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ క్రమంలోనే తన రాజకీయ గురువు బండారు దత్తాత్రేయతో, బండి సంజయ్‌తో ఉన్న సత్సంబంధాలతో జిట్టా బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment