అనిల్‌కుమార్‌రెడ్డికి విక్టరీ సింబల్ చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్)
సాక్షి, యాదాద్రి: మూడు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ టికెట్ ఖరారు అయినట్లు సమాచారం. పార్టీలో చేరిక సందర్భంగా కేసీఆర్ ఎంపీ టికెట్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.
భువనగిరి పార్లమెంట్ స్థానానికి 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ పరాజయం పొందారు. అనంతరం బూర నర్సయ్య బీజేపీలో చేరారు. ఆయన రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి బలమైన అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ అధినేత అన్వేషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన అనిల్‌కుమార్‌రెడ్డికి ఎంపీ టికెట్ హామీ లభించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుతో భేటీ జరిగింది.
ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తానని సీఎం హామీ ఇవ్వగా అనిల్‌కుమార్‌రెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్దిలు ఇద్దరూ భువనగిరిలో కలిసి పనిచేయాలని చెప్పిన విషయం వెనక అంతరార్థం ఇదేనని బీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు. అనిల్‌కుమార్‌రెడ్డి చేరికతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి అసెంబ్లీ టికెట్ విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment