సాగర్‌లో ఆశావహుల జోరు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో ఆశావహుల జోరు

Published Tue, Aug 15 2023 2:00 AM | Last Updated on Tue, Aug 15 2023 10:53 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నెలలోనే అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించేందుకు అధిష్టానం సిద్ధమవుతున్న తరుణంలో.. ఆ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయానే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా అన్ని సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ప్రకటిస్తారన్న ప్రచారం సాగుతుండటంతో ఆందోళన తప్పడం లేదు. టికెట్‌ ఇస్తారో లేదోనని కొందరు ఎమ్మెల్యేలు, అవకాశం వస్తుందో లేదోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. మొదటి జాబితా వెలువడుతుందన్న ప్రచారంతో ఆశావహులంతా మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

నాగార్జున సాగర్ బరిలో మన్నెం రంజిత్ యాదవ్
నాగార్జునసాగర్‌లో ఆశావహులు జోరు పెంచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గాలు మొదటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. ఒకరి వర్గం సమావేశాలు నిర్వహిస్తే మరొకరి వర్గం నేతలు హాజరుకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టికెట్‌ కోసం ఆశావహులు జోరు పెంచారు. ముఖ్యంగా అక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న బుసిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ బుసిరెడ్డి పాండురంగారెడ్డి పెద్ద ఎత్తున సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.

మరోవైపు మన్నెం రంజిత్ యాదవ్‌కు గులాబీ పార్టీ నుంచి ఈసారి టికెట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో యాదవ్‌ వర్గానికే టికెట్‌ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌ మొగ్గు చూపితే.. ఆ అవకాశం రంజిత్‌ యాదవ్‌కు వరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా తన కేసీఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగర్‌ అభ్యర్థి పేరు మొదటి జాబితాలో ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఐదుగురి పేర్లు పక్కా!
ఐదు నియోజకవర్గాల్లో పోటీలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఇప్పటికే పక్కాగా మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. అందులో సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి, తుంగతుర్తిలో గాదరి కిషోర్‌కుమార్‌, భువనగిరిలో ఫైళ్ల శేఖర్‌రెడ్డి, మిర్యాలగూడలో నల్లమోతు భాస్కర్‌రావు పేర్లు మొదటి జాబితాలో ఉంటాయనే ప్రచారం సాగుతోంది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు జిల్లాలో జరిగిన పలు సమావేశాలకు హాజరైన సందర్భంలో.. వచ్చే ఎన్నికల్లో వారిని భారీ మెజారిటీ గెలిపించాలని పిలుపునివ్వడమే ఇందుకు ఉదాహరణ. ఇక వారితోపాటు మరికొందరి పేర్లు కూడా మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. మొత్తానికి మొదటి జాబితాలో 8 మంది పేర్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

వామపక్షాలతో పొత్తుకుదిరితే..
వామపక్షాలతో పొత్తు కుదిరితే మునుగోడును సీపీఐకి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది తేలేవరకు బీఆర్‌ఎస్‌ మునుగోడు అభ్యర్థి పేరును ప్రకటించడంలో జాప్యం చేసే అవకాశం ఉంది. పొత్తులేదంటే మరోసారి సిట్టింగ్‌ల కోటాలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్‌ అనే ప్రచారం సాగుతోంది. అయితే ఇక్కడి నుంచి ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దేవరకొండలోనూ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు డిండిలో ప్రత్యేకంగా సమావేశం పెట్టి మరీ తీర్మానించారు. దీంతో మొదటి జాబితాలో ప్రకటిస్తారా? లేదా? అభ్యర్థి మార్పు ఉంటుందా? అన్నది సందిగ్ధంగా ఉంది.

మరో బీసీకి ఇవ్వాల్సి వస్తే ‘జూలూరి’కి చాన్స్‌
కోదాడ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. అయితే, సొంత పార్టీలోని అసమ్మతి ఆయనకు తలనొప్పిగా మారింది. నియోజకవర్గానికి చెందిన కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి వంటి స్థానిక నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు సపోర్టు చేయబోమని ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి మరీ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్‌ ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చాల్సి వస్తే అక్కడ మరో బీసీ నేతకే చాన్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. అందులో తెలంగాణ తొలి బీసీ కమిషన్‌ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారునిగా, సాహితీవేత్తగా ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావుకు దగ్గరగా ఉన్న ఆయనకు అవకాశం ఇస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement