మఠంపల్లి ఎస్‌ఐ జరిమానా చెల్లించిన రశీదు
నల్గొండ: కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను మఠంపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉన్న ఎస్‌ఐ బాలకృష్ణకు రూ.5వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఎస్‌ఐ సోమవారం రాష్ట్ర న్యాయ సేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించి రశీదు పొందారు. వివరాలు.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన వల్లపుదాసు కలమ్మకు భూమిని ఆమె ఆడపడుచు యరగాని విజయలక్ష్మి, ఆమె భర్త గురువయ్య ఫోర్జరీ సంతకాలతో మ్యూటేషన్ చేయించుకుని పట్టాదారు పాసుపుస్తకం పొందారు.
ఈ విషయం తెలుసుకున్న కళమ్మ మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సూర్యాపేట ఎస్పీ, కోదాడ డీఎస్పీ, హుజూర్‌నగర్ సీఐకి రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హుజూర్‌నగర్ కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయవాది కాల్వ శ్రీనివాసరావు ద్వారా కళమ్మ ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేయగా న్యాయమూర్తి ఆ కంప్లైంట్‌ను మఠంపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎస్‌ఐ కోర్టు ఉత్తర్వులను ఖాతరు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై పూర్తి వాదనలు విన్న న్యాయమూర్తి సీవీ భాస్కర్‌రెడ్డి మఠంపల్లి ఎస్‌ఐ బాలకృష్ణను రాష్ట్ర న్యాయసేవా సంస్థకు రూ.5వేలు జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించారు. ఈ మేరకు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ పేరుతో ఎస్‌ఐ బాలకృష్ణ జరిమానా రూ.5వేలు చెల్లించి రశీదు పొందారు. కాగా గత నెలలోనే ఇక్కడ పనిచేసిన మరో ఎస్‌ఐకి హైకోర్టు రూ.2వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment