సాక్షి, యాదాద్రి: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బయటపడ్డాయి. ఆయనపై జరుగుతున్న విచారణ సందర్భంగా.. భువనగిరి జిల్లాలో భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. విలువైన వ్యవసాయ భూములను తన కుటుంబ సభ్యుల పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు తేలింది. వలిగొండ, బీబీనగర్, మోత్కూరు మండలాల్లో శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరున గల 52.31 ఎకరాల వ్యవసాయ భూముల వివరాలను ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి వాటిని ఫ్రీజ్ చేయాలని కోరినట్లు సమాచారం.
రిజిస్టర్ డాక్యుమెంట్ల కావాలి
శివబాలకృష్ణ కుటుంబ సభ్యులైన శివనవీన్, శివఅరుణ, ఎస్.ప్రసాద్, ఎస్.పద్మావతి, ఎస్.రఘుదేవి పేరున వ్యవసాయ భూముల డాక్యుమెంట్ల ఫ్రీజ్ చేయాలని కలెక్టర్‌ను ఏసీబీ అఽధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్లు, స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన గుర్తింపు కార్డులు, మ్యుటేషన్ ఫైల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే, శివబాలకృష్ణ కుటుంబ సభ్యులకు సంబందించిన డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్లను నిలిపివేయాలని, తాము ఇచ్చిన వివరాల ప్రకారం ధరణీ పోర్టల్‌లోఉన్న రికార్డులను, కార్యాలయంలో ఉన్న రికార్డుల హార్డ్ కాపీలను పరిశీలించాలని కోరారు. శివబాలకృష్ణ పేరు మీద జిల్లాలో ఇంకేమైన ఆస్తుల డాక్యుమెంట్‌లు ఉంటే వాటికి సంబంధించి చెల్లించిన ఫీజు వివరాలను తమకు ఇవ్వడంతోపాటు వాటిని కూడా ఫ్రీజ్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు.
22 మంది ఆధార్‌కార్డులు
శివబాలకృష్ణకు కుటుంబ సభ్యులు, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు, స్నేహితులు, బావమరిది, సొదరుని కుమారులు, కోడలు, వారి స్నేహితులకు సంబంధించి మొత్తం 22మంది ఆధార్ కార్డులు కలెక్టర్‌కు ఏసీబీ అధికారులు పంపించారు. జిల్లాలో ఎక్కడైనా వీరికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఆస్తిపాస్తుల వివరాలు తమకు ఇవ్వడంతో పాటు వాటికి సంబంఽధించిన రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరారు.
ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల వివరాలు ఇవీ..
శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరుతో భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారులు గుర్తించిన భూముల వివరాలు ఇలావున్నాయి.. వలిగొండ మండలం నర్సాపూర్‌లో ఎస్.హరిప్రసాద్ పేరున 8 ఎకరాలు, ఎస్.రఘుదేవి పేరున 11.03 ఎకరాలు, వలిగొండ మండల చిత్తాపురంలో ఎస్.పద్మావతి పేరున ఎకరం 30 గుంటలు, బీబీనగర్ మండలం చిన్నరావులపల్లిలో శివఅరుణ పేరున 20 గుంటలు, మోత్కూరు మండలం పాలడుగులో శివనవీన్ పేరున 6.32 ఎకరాలు, 12.5 ఎకరాలు, వలిగొండ మండలం రెడ్లరేపాకలో శివనవీన్ పేరున 4.22 ఎకరాలు, 5.32 ఎకరాల వ్యవసాయ భూమిని వారి కుటుంబ సభ్యులపేరున ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment