మాట్లాడుతున్న కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
సాక్షి, నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చోటు లేదని కేంద్ర ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని, కేంద్రం నిధులతో చేసిన పనులను తమ ఖాతాల్లో వేసుకొని ప్రచారం చేసుకుంటోందని అన్నారు.
దేశంలో కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అరాచకాలే మిగిలాయన్నారు. 1997లోనే తెలంగాణ ఇవ్వాలని బీజేపీ తీర్మానం చేసిందని తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తే తండ్రీకొడుకులు కమీషన్లకు కక్కుర్తిపడి వాటిని రానివ్వడం లేదని పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో నాయకులు మధుకర్, సంకినేని వెంకటేశ్వరావు, బొబ్బ భాగ్యారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment