నల్లగొండ: ఎంతగానో పోరాడితే వచ్చిన అవకాశంతో గెలిచి అసెంబ్లీలో ఒకసారి అడుగు పెట్టారు. ఆ తరువాత వారిలో చాలా మందికి మరోసారి అవకాశం రాలేదు. వచ్చినా.. గెలువలేక కనుమరుగయ్యారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నా అసెంబ్లీ ఎన్నికల పోరులో చతికిల పడ్డారు. అలాంటి నేతలు ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఉన్నారు. 1952 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో చాలా మంది నేతలది అదే పరిస్థితి. రెండోసారి ఎమ్మెల్యే అయ్యేందుకు ఎంత ప్రయత్నించినా ఒక్కసారికే పరిమితమై.. వన్‌టైమ్ వండర్స్‌గా మిగిలిపోయారు.
రెండోసారి అదృష్టం ఎందరికో..
ఉమ్మడి జిల్లాలో 2018, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారంతా ఇప్పుడు మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అందులో కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్ ఉన్నారు. 2014లో గెలిచి, 2018లో ఓడిపోయిన వేముల వీరేశం రెండోసారి పోటీలో ఉండనుండగా, 2018 ఎన్నికల్లో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మూడోసారి బరిలో ఉండబోతున్నారు. వారిలో ఎవరు ఎమ్మెల్యేగా ఒక్కసారికే పరిమితం అవుతారు.. ఎవరు రెండోసారి గెలుస్తారనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
1952 నుంచి నియోజకవర్గాల వారీగా ఇలా..
నల్లగొండ: 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న నల్లగొండ నుంచి పీడీఎఫ్ తరఫున గెలిచిన పి.లక్ష్మయ్య, కట్టా రాంరెడ్డి ఒక్కసారికే పరిమితం అయ్యారు. 1957లో పీడీఎఫ్ నుంచే గెలిచిన వెంకటరెడ్డిది కూడా అదే పరిస్థితి. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గడ్డం రుద్రమదేవి, 1989లో టీడీపీ నుంచే విజయం సాధించిన మల్‌రెడ్డి రఘుమారెడ్డి, 1994లో సీపీఎం నుంచి గెలిచిన నంద్యాల నర్సింహారెడ్డి ఒక్కసారికే పరిమితం అయ్యారు.
నకిరేకల్: ఇక్కడ 1962లో సీపీఐ నుంచి గెలిచిన నంద్యాల శ్రీనివాసరెడ్డి, 1972లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎం.కమలమ్మ ఆ తరువాత తెరమరుగయ్యారు. 2014లో గెలిచిన వేముల వీరేశం ఇప్పుడు మళ్లీ పోటీలో ఉన్నారు.
మునుగోడు: 1952 నుంచి 1965 వరకు చిన్నకొండూరు నియోజకవర్గంగా ఉండగా, 1967 నుంచి మునుగోడుగా మారింది. 1952లో కె.వెంకటరామారావు, 1962లో కె.గురునాథ్‌రెడ్డి ఒక్కొక్క సారే ప్రాతినిధ్యం వహించారు. కె.వెంకటరామారావు 1957లో రెండోసారి పోటీచేసే అవకాశం వచ్చినా విజయం సాధించలేదు. 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకటరెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు ఒక సారికే పరిమితం అయ్యారు.
నాగార్జునసాగర్: 1962లో పెద్దవూర నియోజకవర్గంగా, 1967 నుంచి 2004 ఎన్నికల వరకు చలకుర్తి నియోజకవర్గంగా ఉండి 1999 నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గంగా మారింది. 1962లో సీపీఐ నుంచి గెలిచిన పి.పర్వతరెడ్డి ఇక్కడి నుంచి మళ్లీ పోటీ చేయలేదు. ఈయన 1967లో దేవరకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మళ్లీ గెలవలేదు.
మిర్యాలగూడ: 1957లో పీడీఎఫ్ నుంచి గెలిచిన సి.వెంకట్‌రెడ్డి ఇక రెండోసారి పోటీచేయలేదు. 1989లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తిప్పన విజయసింహారెడ్డి రెండోసారి గెలవలేదు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రేపాల శ్రీనివాస్ కూడా ఒక్కసారే గెలిచారు. 1983లో ఎమ్మెల్యేగా పనిచేసిన చకిలం శ్రీనివాసరావు ఆ తరువాత ఎంపీగా గెలిచారు.
హుజూర్‌నగర్ : 1952 నుంచి 1972 వరకు ఉన్న హుజూర్‌నగర్ నియోజకవర్గం ఆ తరువాత రద్దయింది. 2009 ఎన్నికల్లో పునరుద్ధరించారు. 1952లో పీడీఎఫ్ నుంచి గెలిచిన టి.నర్సింహులు, జయసూర్య, అదే ఏడాది ఉప ఎన్నికల్లో గెలిచిన ఎం.మొహియుద్దీన్, 1957లో గెలిచిన దొడ్డా నర్సయ్య రెండోసారి గెలవలేదు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కె.జితేందర్‌రెడ్డికి నియోజకవర్గం రద్దుతో ఆ తరువాత అవకాశం రాలేదు.
భువనగిరి: 1952లో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గోక రామలింగం మళ్లీ అసెంబ్లీలో కనిపించ లేదు. 1962లో పీడీఎఫ్ నుంచి గెలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఒక్కసారికే పరిమితం అయ్యారు.
కోదాడ : 1978లో ఏర్పాటైన కోదాడ నియోజకవర్గం నుంచి గెలిచిన అక్కిరాజు వాసుదేవరావు ఆ తరువాత తెరమరుగయ్యారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వి.లక్ష్మీనారాయణరావు 1989లో పోటీచేసినా విజయం సాధించలేదు.
ఆలేరు: 1952 నుంచి1972 వరకు జనరల్ స్థానంగా ఉన్న ఈ నియోజకవర్గం 1978లో ఎస్సీ రిజర్వుడ్ అయ్యింది. తిరిగి 2009లో జనరల్ స్థానంగా మారింది. ఇక్కడి నుంచి 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాలూరి పోచయ్యకు 1983లో పోటీచేసినా గెలువలేదు. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన బూడిద భిక్షమయ్యగౌడ్ ఆ తరువాత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు.
దేవరకొండ: ఈ నియోజకవర్గంలో 1952 ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి గెలిచిన అనంత రామారావు మళ్లీ అసెంబ్లీ ముఖం చూడలేదు. 1957లో ఇద్దరు ఎమ్మెల్యేలు(ద్విసభ్య నియోజకవర్గం) విజయం సాధించగా వారిలో ఎం.లక్ష్మయ్య (కాంగ్రెస్) తిరిగి ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. 1962లో సీపీఐ నుంచి గెలిచిన యెలిమినేటి పెద్దారెడ్డి (వై.పెద్దయ్య), 1972లో సీపీఐ నుంచే గెలిచిన బి.రామశర్మ ఒక్కసారికే పరిమితం అయ్యారు.
1978లో ఈ స్థానం ఎస్టీలకు రిజర్వు అయింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాగ్యానాయక్ నక్సలైట్ల చేతిలో హతమయ్యారు. దీంతో 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో రాగ్యానాయక్ భార్య భారతి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఆమె ఆ తరువాత మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయలేదు.
సూర్యాపేట: ఈ నియోజకవర్గం మొదట జనరల్ స్థానంగా, ఆ తర్వాత ఎస్సీ రిజర్వుడుగా తిరిగి 2009 నుంచి జనరల్ స్థానంగా మారింది. 1972లో యడ్ల గోపయ్య, 1978లో అనుములపురి పరంధాములు గెలిచి.. ఆ తరువాత తెరమరుగయ్యారు. టీడీపీ తరఫున 1983లో ఈద దేవయ్య, 1985లో డి.సుందరయ్య ఒక్కసారికే పరిమితం అయ్యారు. 1999లో దోసపాటి గోపాల్, 2004లో వేదాసు వెంకయ్య ఒక్కసారికే పరిమితం అయ్యారు.
తుంగతుర్తి : 1962లో నాగారం నియోజకవర్గంగా ఉండగా 1967 నుంచి తుంగతుర్తిగా మారింది. 1962లో ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎ.రంగారెడ్డి మళ్లీ గెలువలేదు. 1967లో గెలిచిన బి.నారాయణరెడ్డి, 1972లో జి.వెంకటనర్సయ్య ఒక్కసారికే పరిమితం అయ్యారు. 1999లో టీడీపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు ఒక్కసారే గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment