నల్లగొండ టౌన్: చికెన్ రేటు రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో చికెన్ స్కిన్‌తో రూ.155 ధర పలుకుతోంది. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ ధర (స్కిన్‌తో) రూ.270 నుంచి రూ.285పైగా పలికింది. అప్పుడు సామాన్యులు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ప్రస్తుతం కార్తీకమాసం కావడం, అయ్యప్పమాలలు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తున్న నేపథ్యంలో చికెన్ వాడకం సగానికి సగం పడిపోయింది.
దీంతో చికెన్ ధర కూడా తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు అంటున్నారు. కార్తీకమాసం ముగిసే వరకు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే కోళ్ల ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నప్పటికీ చికెన్ వాడకం తగ్గడంతో కోళ్ల పెంపకందారులు నష్టాలపాలయ్యే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ పార్టీల నేతలు విందులు చేసే అవకాశం ఉన్నందున రెండు, మూడు రోజుల్లో వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందన్న చికెన్ సెంటర్ నిర్వాహకులు భావిస్తున్నారు.
చికెన్ ధర ఇలా.. (కిలో రూ.లలో..)
నెలక్రితం ప్రస్తుతం
విత్ స్కిన్ 285 155
స్కిన్ లెస్ 310 180
కార్తీక మాసం కావడంతో ధర తగ్గింది
ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో మహిళలు చాలా వరకు చికెన్ ముట్టరు. దీంతో చికెన్ కొనేవారు సగానికి సగం తగ్గడంతో చికెన్ రేటు కూడా పడిపోయింది. నెల క్రితం కిలో రూ.285 వరకు ఉన్న చికెన్ నేడు రూ.155 మాత్రమే అమ్ముతున్నాము. ఎన్నికలు ఉన్నందున ఒకటి రెండు రోజుల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా.
–నాగయ్య, చికెన్‌సెంటర్ యజమాని, నల్లగొండ
Comments
Please login to add a commentAdd a comment