మంజుల (ఫైల్)
రామగిరి(నల్లగొండ): ఓ మహిళను దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ సంఘటన తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలంలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు ఈదయ్య కూమార్తె మంజుల(34)కు ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది.
వారికి ఓ కుమారుడు ఉన్నాడు. మంజులకు ఆమె భర్తతో 7సంవత్సరాలుగా గొడవలు జరుగుతుండడంతో తల్లిగారి ఊరైన వెలుగుపల్లిలో ఉంటుంది. అయితే మంజుల రెండు నెలలుగా నల్లగొండలోని మెడికల్ కళాశాలలో వంటపని చేస్తోంది. బుధవారం మంజుల సోదరుడు బైక్‌పై ఆమెను నల్లగొండలో డ్యూటీ వద్ద వదలివెళ్లాడు.
గురువారం ఉదయం అనిశెట్టి దుప్పలపల్లి నుంచి బసిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో మంజుల గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురైంది. ఉదయం ఈ ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శాలిగౌరారం సీఐ రాఘవరావు, ఎస్సై ఎన్.ధర్మా హత్య జరిగిన చోటుకు చేరుకుని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మంజుల మెడకు చున్నీ బిగ్గరగా చుట్టి తలపై కొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
సంఘటన స్థలంలో లంచ్ బాక్సు, చెప్పులతో పాటు హత్యకు ఉపయోగించిన ఆటో జాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డెడ్‌బాడీ ఆచూకీ తెలియకపోవడంతో అనిశెట్టి దుప్పలపల్లి సెక్రటరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వాట్సాప్ ద్వారా మృతదేహం గుర్తింపు..
హత్య జరిగిన వివరాలను, డెడ్‌బాడీ ఫొటోలను పోలీసులు చుట్టు పక్కల ఉన్న గ్రామాల వారి వాట్సాప్ గ్రూప్‌లకు పంపించారు. మధ్యాహ్నం వరకు కూడా వివరాలు తెలియలేదు. వెలుగుపల్లికి చెందిన వాట్సాప్ గ్రూప్‌లో ఫొటోలు రావడంతో మంజుల సోదరుడు ఆమె వేసుకున్న దుస్తుల ను గుర్తించి వెంటనే పోలీసులను సంప్రదించాడు.
మిస్టరీగా మిగిలిన హత్య..
మంజుల హత్య మిస్టరీగా మిగిలింది. సంఘటన స్థలంలో హత్యకు ఉపయోగించిన ఆటో జాకీ తప్ప పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అదే విధంగా మంజుల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. హత్య జరగడానికి ముందు మంజుల ఎవరితో మాట్లాడింది అనే ఫోన్ సంభాషణ వివరాలను తీసేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోన్ సంభాషణ బయటకు వస్తే కేసు వీడనుంది.
Comments
Please login to add a commentAdd a comment