పర్యావరణ హితం.. రమణి అభిమతం
ఫ బయోడీగ్రేడబుల్ బ్యాగులు తయారు చేస్తున్న మహిళా పారిశ్రామికవేత్త
ఫ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమతో పలువురికి ఉపాధి
చౌటుప్పల్ రూరల్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా భూమిలో త్వరగా కలిసిపోయే బ్యాగులు తయారు చేయాలనే సంకల్పం ఆమెను పారిశ్రామికవేత్తను చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సంతమంగుళూరు మండలం మామిళ్లపల్లికి చెందిన శ్రీరామనేని రమణి ఎమ్మెస్సీ వరకు చదివింది. రమణి భర్త డాక్టర్ ప్రసాద్ సౌదీ అరేబియాలోని రియాద్‌లో ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వహించడంతో ఆమె కూడా 13 ఏళ్ల పాటు అక్కడే ఉండి భారత్‌కు తిరిగివచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత రమణి భర్తకు కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె తన కిడ్నీ దానం చేసింది. ఆ సమయంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడీగ్రేడబుల్ సంచులు తయారు చేయాలనే ఆలోచన రావడంతో ఆమె డీఆర్‌డీఓ శాస్త్రవేత్తల్ని కలిసింది. డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు సూచించిన పరిజ్ఞానంతో బయోడీగ్రేడబుల్ సంచులు తయారు చేయడం ప్రారంభించారు. రెండేళ్ల పాటు కుటీర పరిశ్రమగా నిర్వహించిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రమణి ఇండసీ్ట్రస్ పేరుతో బయోకంపోస్టికా పరిశ్రమను స్థాపించారు. గతేడాది నవంబర్ నుంచి ఇక్కడ నుంచి బయోడీగ్రేడబుల్ సంచులు, గిఫ్ట్ బ్యాగుల తయారీని ప్రారంభించారు. క్యారీ బ్యాగులు, ఎన్వలప్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ షీట్లు, మల్చింగ్ కవర్లు ఈ పరిశ్రమలో తయారు చేస్తున్నారు. వాటిని సౌదీ అరేబియాకు ఎగుమతి చేస్తున్నారు. ఈ పరిశ్రమలో రెండు షిఫ్ట్‌ల వారీగా 35మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
పర్యావరణ హితం.. రమణి అభిమతం
Comments
Please login to add a commentAdd a comment