భూసారం కాపాడుకుంటేనే అధిక దిగుబడి
ఫ కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు
ఫ కేవీకేలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు కిసాన్ మేళా
త్రిపురారం: పంటల సాగులో రసాయన మందులు వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుందని, భూసారాన్ని కాపాడుకుంటేనే అధిక దిగుబడులతో సాధించవచ్చని త్రిపురారం మండలంలోని కంపాసాగర్‌లో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రోగాం కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం కేవీకేలో ఉమ్మడి జిల్లాలోని రైతులకు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. వరితో పాటు వివిధ రకాల పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురు కేవీకే శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలోని పోషకాలు మొక్కలకు సమపాలల్లో అందాలంటే సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలన్నారు. చీడపీడల నివారణకు అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పంట నష్టపోవాల్సి వస్తుందన్నారు. వరి పొలంలో యూరియాతో పాటు పొటాష్ వేసుకోవడం వల్ల చీడపీడలను తట్టుకునే శక్తి పెరుతుతుందన్నారు. ప్రస్తుతం వరి పైరులో అగ్గితెగులు, కాండం కుళ్లు తెగులు, సుడిదోమను గమనించామని శాస్త్రవేత్తల సలహాలతో పురుగు మందులు సకాలంలో పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త లింగయ్య, సేద్యపు విభాగం శాస్త్రవేత్త చంద్రశేఖర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ, యంగ్ ప్రొఫెషనల్స్, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment