పారితోషికం పైసలేవి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వేలో విధులు నిర్వర్తించిన సిబ్బందికి ఇంత వరకు పారితోషికంఅందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆ డబ్బులను ఇవ్వగా, నల్లగొండలో ఇప్పటివరకు అందకపోవడంతో విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే ముగిసి నాలుగు నెలలు గడిచినా ఇంత వరకు ఆ డబ్బులు ఎందుకు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
నవంబర్‌లోనే పూర్తయినా..
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే చేపట్టింది. జిల్లాలోని 33 మండలాల పరిధిలోని 868 గ్రామ పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల్లో ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల (కేజీబీవీ) టీచర్లు, అధ్యాపకులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంఆర్‌సీ సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. సర్వే పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులను సూపర్‌వైజర్లుగా, మండల ప్రత్యేక అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించి ఈ సర్వే చేయించారు. గత ఏడాది నవంబరు 9వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఇలా ఒక్కో ఎన్యుమరేటర్ రోజుకు 150 ఇళ్ల వరకు సర్వే చేశారు. ఆ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారి నేతృత్వంలో ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేశారు.
బ్యాంకు ఖాతాల
వివరాలు ఎప్పుడో ఇచ్చినా..
సర్వే విధుల్లో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల బ్యాంకు ఖాతాల వివరాలను అప్పట్లోనే అందజేశారు. సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్‌కు రూ.10 వేలు, సూపర్‌వైజర్‌కు రూ.12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో ఫారం నమోదు చేసినందుకు రూ.25 చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 490 మంది సూపర్‌వైజర్లు, 4,060 మంది ఎన్యుమరేటర్లు, 4,012 మంది ఆపరేటర్లు ఈ విధులను నిర్వరించారు. ఆ సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ కులగణన సర్వే చేసి నాలుగు నెలలు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
ఫ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందని డబ్బులు
ఫ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 వేల మంది ఎదురుచూపు
పారితోషికం వెంటనే విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని కులగణన సర్వేను చేయించింది. ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే పూర్తయి నాలుగు నెలలు గడిచిపోయింది. జిల్లాలో విధులు నిర్వర్తించిన వారికి ఇంతవరకు గౌరవ వేతనం చెల్లించలేదు. పక్కనున్న సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో చెల్లించారు. ఇక్కడే ఎందుకు చెల్లించడం లేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వెంటనే ఆ డబ్బులను విడుదల చేయాలి.
– పెరుమాళ్ల వెంకటేశం,
టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
పారితోషికం పైసలేవి?
Comments
Please login to add a commentAdd a comment