
బాలికపై అత్యాచారయత్నం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట): బతుకుదెరువు కోసం ఇటుకబట్టీలో పని చేయడానికి వచ్చిన బాలికపై ఇటుకబట్టీ యజమాని అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేట శివారులో వెంగమాంబ బాలాజీ ఇటుకబట్టీ యజమాని గోగినేని వెంకటరమణ ఇటుకల తయారీ కోసం కొందరు కూలీలను ఒడిశా నుంచి తీసుకువచ్చాడు. బుధవారం మద్యం మత్తులో ఉన్న వెంకటరమణ అక్కడే పనిచేస్తున్న బాలికను చాక్లెట్ ఇస్తా అని పిలిచి అత్యాచారయత్నం చేశాడు. బాలిక భయంతో కేకలు వేస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒడిశా నుంచి వచ్చిన కూలీలు వెంకటరమణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్ గౌడ్ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇటుక బట్టి యజమాని వెంకటరమణను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. శుక్రవారం బాలికను భరోసా సెంటర్‌కు తరలించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఈమేరకు వెంకటరమణపై పోక్సో, లేబర్ యాక్ట్, జువైనల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.