
మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి
హుజూర్‌నగర్ : మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణంలోని సీతారాంనగర్ కాలానికి చెందిన అలకుంట్ల భిక్షం (39) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 29 బాగా మద్యం సేవించిన భిక్షం.. భార్యను భయపెట్టాలనే ఉద్దేశంతో ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను ఎలాంటి మందు తాగలేదని చెప్పడంతో భిక్షంను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం భిక్షం ఇంటి వద్ద వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆదివారం మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భిక్షంకు భార్య నిరోషా, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, మనీషా ఉన్నారు. సోమవారం పెద్ద కుమార్తె డేరంగుల స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.