
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్సు కండక్టర్
చౌటుప్పల్ : ప్రయాణికురాలు మరిచి పోయి బ్యాగును గుర్తించిన కండక్టర్ కంట్రోలర్‌కు అప్పగించి నిజాయితీని చాటుకుంది. వివరాలు.. దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ప్రయాణికులతో చౌటుప్పల్‌కు వస్తోంది. ఓ ప్రయాణికురాలు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కి కండక్టర్ ప్రవీణ వద్ద చౌటుప్పల్‌కు టికెట్ తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చౌటుప్పల్‌లో బస్సు దిగి వెళ్లిపోయింది. అయితే బస్సులో బ్యాగు ఉండడాన్ని కండక్టర్ గుర్తించి దాన్ని చౌటుప్పల్ బస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన కంట్రోలర్ నాగేష్‌కు అప్పగించింది. సాయంత్రం తిరిగి వచ్చిన ఆ ప్రయాణికురాలు కంట్రోలర్‌ను సంప్రదించింది. తన బ్యాగు, అందులోని వివరాలను తెలియజేసింది. కంట్రోలర్ విచారించి బ్యాగు ఆమెదే అని నిర్దారించుకున్నాడు. అదే బస్సు సాయంత్రం బస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో కండక్టర్ ప్రవీణతో కలిసి బ్యాగును అప్పగించాడు. అందులో 15 తులాల వెండి ఆభరణాలు, నడుము వడ్డాణంతోపాటు నగదు ఉన్నాయి. కాగా ప్రయాణికురాలి బ్యాగును నిజాయితీగా అప్పగించిన కండక్టర్ ప్రవీణతోపాటు కంట్రోలర్ నాగష్‌ను పలువురు అభినందించారు.