
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి, ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు. గర్భాలయంలోని స్వయంభూలు, అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదల అర్చనతో కొలిచారు. అదే విధంగా ప్రాకార మండపం, ముఖ మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం నిర్వహించారు.