వైఎస్సార్‌సీపీలో చేరిన మిద్దె శాంతిరాముడు,ఆయన తనయుడు మిద్దె శివరాం
నంద్యాల: నంద్యాల టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. నిన్న ముస్లిం మైనార్టీకి చెందిన టీడీపీ నాయకులు జీఎం గౌస్ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోగా నేడు ఆర్‌జీఎం విద్యాసంస్థల అధినేత, టీడీపీ సీనియర్ నాయకుడు మిద్దె శాంతిరాముడు తన తనయుడు మిద్దె శివరాంతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమక్షంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీరికి కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మిద్దె శాంతిరాముడు, శివరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు నెరవేరుస్తున్న తీరును చూసి ఆకర్షితులమై పార్టీలో చేరామన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. సీఎం జగన్ మాట ఇస్తే మాట తప్పరని నిరూపించుకుంటున్నారన్నారు.
ప్రస్తుతం టీడీపీ నాయకులకు సైతం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని నమ్మకం లేదన్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, దానికి కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమేనన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీలో జోష్
ఆర్‌జీఎం విద్యాసంస్థలు, శాంతిరాం ఆసుపత్రి అధినేత శాంతిరాముడు టీడీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. అలాంటి సీనియర్ నేత పార్టీని వీడటంతో నంద్యాల నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2000లో టీడీపీ నుంచి నంద్యాల మున్సిపల్ చైర్మన్ కు పోటీ చేసిన శాంతిరాముడు 60వేలకు పైగా ఓట్లు వచ్చాయి. నంద్యాల పార్లమెంట్ పరిధిలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టే శాంతిరాముడు ఆయన తనయుడితో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడంతో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది.
నంద్యాల నియోజకవర్గంలో ముస్లింల తర్వా త బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపు (బలిజ) సామాజిక వర్గానికి చెందిన శాంతిరాముడు వైఎస్సార్‌సీపీలో చేరడం విశేషం. రానున్న రోజుల్లో నంద్యాల టీడీపీ నాయకులు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment