స్థిర అభివృద్ధికి ‘సహకార’ం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అంతర్జాతీయ సహకార సంవత్సరంలో చేపట్టాల్సిన అంశాలపై సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా (ఐవైసీ) ప్రకటించి సహకార సంస్థ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారి లక్ష్యాలను ఐక్యరాజ్యసమితి నిర్దేశించిందన్నారు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఐవైసీ స్టేట్ అపెక్స్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. సహకార క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక నినాదంతో ముఖ్య అంశాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పశుసంవర్ధకం, వ్యవసాయం, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, గ్రామీణ అభివృద్ధి.. తదితర శాఖలు సహకర సంఘాల అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలన్నారు. అనంతరం కోపరేటివ్ సొసైటీ బ్యాంకు ద్వారా ఐదుగురు రైతులకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున పంట రుణాలు చెక్కులను అందజేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా సహకార అధికారి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈ భవనంలో టెక్నికల్ విద్య
బేతంచెర్ల: జిల్లాలో డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఎంఎస్‌ఎంఈ భవనంలో టెక్నికల్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బేతంచెర్ల మండలంలో అసంపూర్తిగా ఉన్న భవనాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ. 36 కోట్లతో నిర్మిస్తున్న బీసీ రెసిడెన్సియల్ స్కూలు, పాఠశాల, రూ.5.50 కోట్లతో నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ భవన యూనిట్, రూ.7.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీఐ కళాశాల పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. హెచ్ కొట్టాల గ్రామ సమీపాన రూ.2.20 కోట్లతో నిర్మిస్తున్న బీసీ వాల్మీకి కమ్యూనిటీ భవనం, పట్టణంలో రూ.80 లక్షలతో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ పునరుద్ధరణ పనులు పూర్తికావొచ్చాయన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థులను దత్తత తీసుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనుల జాప్యానికి గల కారణాలను తెలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ జవహర్ బాబు, డీఈ ప్రసాద్ రెడ్డి, ఎంపీడీఓ ఫజుల్ రహిమాన్, ఏఈ మధు, గోరుమాను కొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment