కొత్త నిబంధనల ప్రకారం ఆర్‌సీసీ నిర్మాణాల ధరలు భారీగా పెరగమన్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని అపార్టుమెంట్లలో మొదటి రెండు అంతస్తుల్లోని ప్లాట్లకు ఒక్కో చదరపు ఆడుగు రూ.90 పెరగనుంది. ఇప్పటి వరకు చదరపు అడుగు రిజిస్ట్రేషన్ విలువ రూ.1,400 ఉండగా దీన్ని రూ.1,490కి పెంచుతున్నారు. కొన్ని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని, నగర పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ. 70 పెంచనున్నారు. మూడో అంతస్తు నుంచి మాత్రం గతంలో వసూలు చేసే రేట్లనే కొనసాగించనున్నారు. వాణిజ్య భవనాలకు మాత్రం చదరపు అడుగుకు గతంతో పోల్చితే రిజిస్ట్రేషన్ విలువ రూ.100 పెరగనుంది. ఈ లెక్కన జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్, మున్సిపాలిటీలతో పాటు బేతంచెర్ల తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారులకు రెండు వైపులా ఒకేలా ధరలు పెంచడానికి దస్త్రాలు సిద్ధమయ్యాయి.
నేటి నుంచే అమలు
ఆదాయం పెంచుకోవడమే పరమావధిగా చేసుకున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం భూ విలువల పెంచింది. ఈ మేరకు జిల్లా అధికారులు పెంపు నివేదికలు సిద్ధం చేసి ముసాయిదాను జిల్లా రిజిస్ట్ట్రార్, 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందజేశారు. ముందుగా ప్రజల నుంచి అరొకరగా అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను రూపొందించడంతో జిల్లా మార్కెట్ విలువల కమిటీ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన భూముల విలువలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే భూముల విలువ తక్కువగా ఉందనుకునే ప్రాంతాల్లో 5 నుంచి 15 శాతం, మిగిలిన ప్రాంతాల్లో 20 నుంచి 60 శాతం వరకు పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. నిర్మాణాల విలువను రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరీలుగా విభజించి ధరలు పెంచినట్లు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీల భారం భారీగా పడనుంది.
అభ్యంతరాలకు అవకాశం ఏదీ?
నిబంధనల ప్రకారం జిల్లాలోని నంద్యాల, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లె, డోన్, అవుకు, బేతంచెర్ల, పాణ్యం, ప్యాపిలి, నందికొట్కూరు, బండి ఆత్మకూరు, ఆత్మకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల విలువ పెంపునకు సంబంధించిన వివరాలను కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అతికించాలి. అయితే, నామ్‌కే వాస్తే కొన్ని కార్యాలయాల్లో మాత్రమే వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. చాలా చోట్ల ప్రజలు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భూములు, స్థలాలు, కట్టడాల మార్కెట్ విలువలను పెంచినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment