No Headline
మంత్రాలయం: ప్రసిద్ధ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రంలో తొలి కుంభాభిషేక మహోత్సవానికి శనివారం అంకురార్పణ జరగనుంది. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు నేతృత్వంలో మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. రాజగోపురాలపై కలశాల ప్రతిష్ట, గణపతి, లక్ష్మీదేవి, నవగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారు. తూర్పు ప్రధాన రాజగోపురం ముంగిట గణపతి, లక్ష్మీదేవి మంటపాలు సిద్ధం చేశారు. అలాగే ఆలయ ఈశాన్య భాగంలో నవగ్రహాల మంటపం నెలకొల్పారు. ఉత్సవాల నేపథ్యంలో రాజగోపురాలు, మహాప్రాకారం, వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయం అభిముఖంగా పచ్చని తోరణాలతో యాగమంటపాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీలు కొలువు దీరేందుకు ఆ పక్కనే ప్రత్యేక వేదిక రూపొందించారు. కలశ ప్రతిష్టను భక్తులు వీక్షించేందుకు ఆలయ చుట్టూ రూ.50 లక్షలతో పందిళ్లు నెలకొల్పారు. భక్తుల సౌకర్యార్థం దాత సాయంతో ప్రత్యేక షెడ్లు వేయించారు. ఇప్పటికే భక్తులకు సరిపడిన లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. రాజగోపురాలపై క్రతువులు గావించేందుకు ప్రతి గోపురం పైకి చేరుకునేందుకు ప్రత్యేక మెట్ల సముదాయాన్ని నెలకొల్పారు. కలశాలను శుక్రవారం ఆదోని పట్టణంలో ప్రత్యేక వాహనంపై ఉంచి ఊరేగించారు.
కుంభాభిషేకానికి నేడు అంకురార్పణ
Comments
Please login to add a commentAdd a comment