రైతన్నల పరిస్థితి దుర్భరం
పాణ్యం: దేశానికి అన్నంపెట్టే రైతన్నల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో దుర్భరంగా మారిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన కూటమి సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. బుధవారం తమ్మరాజుపల్లె కొండలపై వెలసిన కొండ మల్లేశ్వరస్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ రైతును గతంలో ఎన్నడూ లేని విధంగా దళారీల చేతికి అప్పగించారన్నారు. దీంతో వారు అడిగిన ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా కూటమి సర్కారు రైతుకు పైసా సాయం చేయలేదని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించి నేటికీ అమలు చేయకుండా రైతులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఉండేదని, ఏటా పంటపెట్టుబడికి రైతు భరోసా పథకం కింద సాయం అందేదని చెప్పారు. ఇప్పుడు సాయం దేవుడెరుగు కనీసం రైతుల గోడు కూడా బాబు సర్కారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీల అమలుకు రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని చెప్పారు.
ఏ పంటకు మద్దతు ధర లేదు
కూటమి సర్కారు పట్టనట్టు
వ్యవహరిస్తోంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని
Comments
Please login to add a commentAdd a comment