● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
బొమ్మలసత్రం: ప్రజల జీవితాల్లో వెలుగు నింపి వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నంద్యాలలోని జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గపు ఇన్‌చార్జ్ సుధీర్‌కుమార్.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనాకాలంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి పేదవారికి పథకాలు అందజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను ఎలా వంచిస్తున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. ‘కూటమి’ నేతలకు రానున్న రోజుల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. పేద విద్యార్థుల మెడికల్ విద్య కల సాకారానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 కొత్త కాలేజీలు తీసుకొస్తే ఆ కాలేజీలను నిర్వీర్యం చేయాలని కూటమి ప్రభుత్వం చూడటం అవివేకమన్నా రు. సీనియర్ నేత కల్లూరి రామలింగారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలీ, రాష్ట్ర మహిళా జోనల్ ప్రసిడెంట్ శ్వేతారెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి తదితరులు పాల్గొన్నారు.