కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి 15 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రబీలో వర్షాభావ ప్రభావం దాదాపు అన్ని మండలాలపై తీవ్రంగా ఉంది. సాగు విస్తీర్ణం తగ్గిపోగా దిగుబడులు కూడా పడిపోయాయి. అయితే కర్నూలు జిల్లాలో పది మండలాలు, నంద్యాల జిల్లాలో ఐదు మండలాల్లోనే కరువు ప్రభావం ఉందని ఆయా జిల్లా అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఆయా మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ జీవో ఎంఎస్ 3 జారీ చేసింది. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి, డోన్ మండలాలు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ మండలాలు కరువు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
కర్నూలు జిల్లాలో కరువు మండలాలు:
ఆస్పరి, కల్లూరు, కర్నూలు రూరల్, కర్నూలు అర్బన్, మద్దికెర, ఓర్వకల్, గూడూరు, కోడుమూరు, వెల్దుర్తి, పత్తికొండ.
నంద్యాల జిల్లాలో కరువు మండలాలు:
కొలిమిగుండ్ల, సంజామల, బనగానపల్లి, ఉయ్యలవాడ, బేతంచెర్ల.
నంద్యాల నుంచి ‘ఒంటిమిట్ట’కు తలంబ్రాలు
నంద్యాల(వ్యవసాయం): శ్రీరామనవమిని పురస్కరించుకొని ఒంటిమిట్ట రామాలయానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను నంద్యాల నుంచి సోమవారం పంపించారు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో తలంబ్రాలకు మనూరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుంటూరు ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈర్నపాడు గ్రామంలో ఎటువంటి రసాయన పదార్థాలు వాడకుండా వడ్లను పండించామన్నారు.
గత మూడు నెలల నుంచి గోటితో వడ్లను భక్తిశ్రద్ధలతో మనూరు, మనగుడి, మనబాధ్యత సభ్యులు ఒలిచి తలంబ్రాలను తయారు చేశారన్నారు. ఒంటిమిట్టలో జరిగే స్వామి వారి కల్యాణానికి ఆలయ ఈఓకు అందజేస్తామన్నారు. గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి, భగవత్ సేవా సమాజ్ సభ్యులు సూరయ్య, శ్రీనివాసులు, భవనాశి వాసు, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
పండుగ రోజూ రిజిస్ట్రేషన్లు
కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ పండుగ ఉన్నా ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేశాయి. మొత్తం 100 వరకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. కాగా.. కర్నూలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టైం స్లాట్ బుకింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. గతం నుంచే ఈ విధానం అమల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటిసారి ప్రవేశపెట్టారని ప్రచారం చేసుకోవడం గమనార్హం.