
● గిరిజన విద్యార్థులకు నెలకోసారి చికెన్ పెట్టడం లేదు ●
విద్యార్థులకు పౌష్టికాహారం అందించండి
శ్రీశైలంప్రాజెక్ట్: గిరిజన గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పౌరసరఫరాల గోదాము, గిరిజన గురుకుల పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రైవేటు కాంట్రాక్టర్ల సరఫరాకు, గిరిజన కో– ఆపరేటివ్ సొసైటీ వస్తువుల సరఫరా ధరలో వ్యత్యాసం ఉండడంతో విద్యార్థులకు అందించే మెనూలో కొంత సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరాలు తప్పడం లేదని వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే వంట–వార్పునకు తగిన సిబ్బంది లేరని తెలిపారు. సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ జి.ఓ.నెం.8 ప్రకారం విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందజేయకపోతే శాఖా పరమైన చర్యలు తప్పవని విజయప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గిరిజన గురుకుల పాఠశాలలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని, వీటిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. సున్నిపెంట గిరిజన గురుకుల విద్యాలయాలలో విద్యార్థులకు సరైన భోజనం అందించడం లేదని, చికెన్ వారానికి రెండు సార్లు పెట్టాల్సి ఉండగా, నెలకు ఒకసారి కూడా విద్యార్థులకు అందించడం లేదని, పెరుగు కూడా అందించని దుస్థితిని ఎందుకు ఏర్పడిందని మండిపడ్డారు. విద్యార్థులకు అందించాల్సిన భోజన పరిమాణం, నాణ్యతలో ఏ మాత్రం తేడా వచ్చినా సహించేది లేదన్నారు. ఈ మేరకు రెండు గిరిజన గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డన్‌లపై చర్యలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేసి గర్భిణులు, బాలింతలతో నేరుగా ఆయన ఫోన్‌లో మాట్లాడి కోడిగుడ్లు, పాలు ఎంత ఇస్తున్నారని ఆరా తీశారు. పౌరసరఫరాల గోదాములను తనిఖీ చేసి స్టాక్ పాయింట్‌లో డీలర్లకు తూకాలు వేసి నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు.