అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు
● కాశినాయన ఆశ్రమమంటూ విరాళాల సేకరణ
● రాజమండ్రి పోలీసులకు చిక్కిన వెలుగోడు ముఠా
ఆత్మకూరురూరల్: అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రా ల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న విషయాన్ని రాజమండ్రి పోలీసులు బట్టబయలు చేశారు. వెలుగోడు మండల కేంద్రంలో నివసించే శంకర్ అనే వ్యక్తి శంకర్ రెడ్డి, భవనం రమణారెడ్డి అనే పేర్లతో చెలామణి అవుతూ దాదాపు లక్షలాది రూపాయలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇతను అతని కులస్తులను కొందరిని తన ముఠాలో చేర్పించుకుని ఖరీదైన దుస్తులు, వేషధారణతో వాహనాల్లో తిరుగుతూ పలు ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. వీరు రెండు రోజుల క్రితం రాజమండ్రిలో తాము ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో వైఎస్సార్ స్మృతివనం సమీపంలో కాశిరెడ్డి నాయనం ఆశ్రమం ఏర్పాటు చేశామని, అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందని చెబుతూ.. చందాలు వసూలు చేసే యత్నం చేశారు. వీరి పోకడ గమనించిన రాజమండ్రికి చెందిన త్రినాథరెడ్డి అనే వ్యక్తి ఈ ముఠాను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన రఘువీరారెడ్డి అక్కడ ఉండడంతో ఆయన ఈ విషయంపై విచారణ జరిపించారు. దీంతో శంకర్ ముఠా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేలడంతో వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద ఉన్న రసీదు పుస్తకాలు, డిజిటల్ లావాదేవీలను పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనే రూ. 20 లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. శంకర్ ముఠాలో వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామానికి చెందిన వారు కూడా ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నల్లకాల్వలో కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఉన్న విషయం నిజమే అయినప్పటికీ ఈ ఆశ్రమ నిర్వాహకులు వేరే వారు కావడం గమనార్హం. ఇందులో వారు ప్రచారం చేసుకుంటున్నంత స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment